మున్సిపల్ కమిటీలను ప్రకటించేందుకు జంకుతున్న టీఆర్ఎస్...

 

టీఆర్ఎస్ మున్సిపల్ కమిటీలను అధికారికంగా ప్రకటించకపోవడానికి ముందున్న మున్సిపల్ ఎన్నికలే అసలు కారణమని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. అనేక మంది పార్టీ పదవులను ఆశిస్తున్నారని ఇప్పుడు ఆ పదవులను ప్రకటిస్తే అసంతృప్తులు ఇతర పార్టీలో చేరే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఒకరికి పదవి ఇస్తే మరో తొమ్మిది మంది అసంతృప్తికి లోనయ్యే పరిస్థితి నెలకొందని అంతిమంగా అది మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపుతుందని పార్టీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు. అందుకోసమే టీఆర్ఎస్ పెద్దలు పార్టీ మున్సిపల్ కమిటీలను ప్రకటించలేకపోతున్నారన్న చర్చ సాగుతోంది.

మరి కొన్ని చోట్ల మెజారిటీ ఎమ్మెల్యేలు మున్సిపల్ కమిటీల కూర్పుని పూర్తి చేసి కూడా వాటిని ప్రకటించేందుకు జంకుతున్నారు. మునిసిపల్ వార్డులకు ఎవరెవరు బాధ్యులు అనేది నోటిమాటగా చెప్పడమే గానీ వారి పేర్లను మాత్రం అధికారికంగా ప్రకటించే సాహసం చేయడం లేదు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఓటు కూడా విలువైందని పదవులు రాని వారు ఆగ్రహిస్తే మొదటికే మోసం వస్తుందని అంతర్గతంగా చర్చించుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగా మున్సిపల్ ఎన్నికల్లో ఆశావహులకు కౌన్సిలర్ టికెట్లు దక్కని వారికి పార్టీ పదవులు ఇచ్చేసి అందరినీ సర్దుబాటు చేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం.

ఈ లెక్కన మున్సిపల్ ఎన్నికలయ్యేదాకా మెజారిటీ మునిసిపాలిటీల్లో టిఆర్ఎస్ కమిటీలను ప్రకటించే అవకాశం కనిపించడం లేదని తెలుస్తోంది. మొత్తానికి ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లోకి ఇబ్బడిముబ్బడిగా చేరిన నాయకులను సర్దుబాటు చేయటం గులాబీ పార్టీ నాయకత్వానికి పెద్ద పరీక్షగా మారినట్టు కనిపిస్తోంది. మరి మున్ముందు ఈ సమస్య ఎలాంటి మలుపులు తీసుకుంటుందో దానికి ఎలాంటి పరిష్కారం తీసుకురాబోతోందో వేచి చూడాలి.