నచ్చనివాళ్లను తప్పించడం... కావాల్సిన వాళ్లకు కట్టబెట్టడం... ఇదేనా రివర్స్ టార్గెట్?

 

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెబుతోన్న రివర్స్ టెండరింగ్ వెనుక అసలు మతలబు ఏమిటి? నచ్చనివాళ్లను తొలగించి... కావాల్సిన వాళ్లకు కాంట్రాక్టులు కట్టబెట్టడమేనా? ఇంతకీ రివర్స్ టెండరింగ్ స్లోగన్ తో జగన్ సర్కారు ఎవరెవరిని టార్గెట్ చేసింది? కేవలం తెలుగుదేశం నేతలు, టీడీపీ సానుభూతిపరులే ...జగన్మోహన్ రెడ్డి టార్గెట్టా? కొన్ని కంపెనీల విషయంలో ఔదార్యం చూపిస్తున్నారు? ఒకచోట కొనసాగిస్తారు? మరోచోట వద్దంటారు? ఇంతకీ పోలవరం, మచిలీపట్నంలో ఎందుకు వద్దు? కాకినాడలో ఎందుకు ముద్దు? కావాలని కొంతమందినే టార్గెట్ చేశారా? రివర్స్ టెండరింగ్ వెనుకున్న అసలు రహస్యం ఇదేనా?

ఎందుకంటే, వైఎస్ హయాంలో కేటాయించిన మచిలీపట్నం పోర్టు పనులను కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండానే ఏకపక్షంగా రద్దుచేసిన జగన్ ప్రభుత్వం... జీఎంఆర్ కాకినాడ సెజ్ విషయంలో మాత్రం ఎక్కడలేని ఓదార్యం చూపిస్తోంది. కాకినాడ సెజ్ కు కూడా వైఎస్ హయాంలో జీఎంఆర్ కు వేలాది ఎకరాలు కేటాయించారు. ఎన్నో వరాలు, రాయితీలు ఇఛ్చారు. కానీ కాకినాడ సెజ్ కి రావాల్సిన స్థాయిలో పరిశ్రమలు రాలేదు. అంతేకాదు జీఎంఆర్ కాకినాడ సెజ్ అవసరాల కోసం వైఎస్ ఆనాడు క్యాప్టివ్ పోర్టుకు అనుమతి ఇవ్వగా, చంద్రబాబు సర్కార్ మరో అడుగు ముందుకేసి, వాణిజ్య పోర్టుగా మార్చేసింది. ఇంతచేసినా, ఇక్కడ చెప్పుకోదగిన స్థాయిలో పారిశ్రామిక ప్రగతి లేదు. అయితే, ఎలాంటి పురోగతి లేదంటూ మచిలీపట్నం పోర్టు పనులను ఏకపక్షంగా రద్దు చేసిన జగన్ ప్రభుత్వం... అలాంటి పరిస్థితే కనిపిస్తోన్న జీఎంఆర్ కాకినాడ సెజ్ విషయంలో ఎందుకు మౌనంగా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అక్రమాలన్నింటినీ, సక్రమం చేస్తామని చెప్పుకుంటున్న జగన్ ప్రభుత్వం.... జీఎంఆర్ కాకికాడ సెజ్ విషయంలో ఎందుకు మౌనంగా ఉంది. కారుచౌకగా వేలాది ఎకరాలు కట్టబెట్టినా, ఆశించినస్థాయిలో ప్రగతి చూపించకపోయినా, అత్యంత వివాదాస్పద స్విస్ ఛాలెంచ్ విధానంలో క్యాప్టివ్ పోర్టును వాణిజ్య పోర్టుగా మార్చేసినా జగన్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఈ ప్రశ్నలన్నింటికీ ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.