కరోనా తగ్గినందుకు కాదు.. ఎన్నికలు వస్తున్నందుకు

న్యూజిలాండ్ ప్రధాని హిందూ దేవాలయాన్ని సందర్శించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 100రోజుల్లో కరోనా పాజిటివ్ కేసులు రాకపోవడంతో కరోనా ఫ్రీకంట్రీగా న్యూజీలాండ్ ను ప్రకటించిన తర్వాత దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవడానికి ఆమె హిందూ దేవాలయాన్ని సందర్శించారని అనేక సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అయ్యింది. అయితే వాస్తవానికి ఆమె హిందు దేవాలయాన్ని సందర్శించిన కారణం వేరే ఉందని అంటున్నారు ఆ దేశంలోని భారత రాయబారి ముక్తేష్ పర్దేషి. సోషల్ మీడియోలో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆయన వివరణ ఇచ్చారు. న్యూజీలాండ్ లో వచ్చెనెల (సెప్టెంబర్) 19 న ఎన్నికలు జరగనున్నాయని ఈ నేపధ్యంలోనే ఆమె హిందూ దేవాలయాన్ని సందర్శించారని అన్నారు.


ఈ నెల 6న జాకిందా అక్లాండ్ లోని రాధాకృష్ణ మందిరానికి వెళ్లారు. ఆమెతో పాటు ఈ ఆలయాన్నిభారత రాయబారి ముక్తేష్ పర్దేషి కూడా సందర్శించారు. కరోనా విపత్కర పరిస్థితి నుంచి బయట పడినందుకు ఆమె దేవాలయానికి రాలేదని ఆయన స్పష్టం చేశారు. కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో జూన్ 8ననే కరోనా ఫ్రీ కంట్రీగా ప్రకటించి అన్ని ఆంక్షలు ఎత్తివేశారని ఆయన చెప్పారు. అయితే తాజాగా నాలుగు  పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని మళ్లీ ఆంక్షలు విధించే అవకాశం ఉందన్నారు.

 

పెరిగిన హిందువుల జనాభా
2018 జనాభా లెక్కల ప్రకారం, న్యూజిలాండ్‌లో భారతీయులు నాల్గవ అతిపెద్ద సమాజంగా అవతరించారు. గతంలో ఇక్కడ హిందువుల జనాభా 89,000 ఉండేది, 2018 నాటికి 1.23 లక్షలకు పెరిగింది.

న్యూజిలాండ్ 40 వ ప్రధాన మంత్రిగా, లేబర్ పార్టీ నాయకురాలిగా ఉన్న జాకిందా మరోసారి ఎన్నికల బరిలో నిలువనున్నారు. ఇప్పటికే కరోనాను అదుపుచేసి ప్రజల అభిమానం చూరగొన్న ఆమె హిందువు ఓట్లు పొందడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే హిందూ దేవాలయాన్ని సందర్శించడంతో పాటు ఇండియన్  వంటకాలైన పూరీ, చోలే తిన్నారు అంటున్నారు స్థానిక హిందువులు.