లోకేష్ రాజకీయ జీవితాన్ని రిస్క్ లో పెట్టిన చంద్రబాబు

 

రాజకీయ నాయకులు తమ వారసులను రాజకీయాలలోకి తీసుకు రావాలంటే.. బాగా సేఫ్ నియోజకవర్గం చూసి ఎన్నికల బరిలోకి దింపుతారు. ఎన్నికలు జరుగక ముందే ఇది పక్కా గెలిచే స్థానమని లెక్క పెట్టుకునే అంత సేఫ్ నియోజవర్గాన్ని ఎన్నుకుంటారు. కానీ చంద్రబాబు మాత్రం తనయుడు లోకేష్ ని రిస్క్ ఉన్న నియోజకవర్గం నుంచి పోటీకి దింపుతున్నారు.

లోకేష్ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి. గతంలో లోకేష్ ని ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కట్టబెట్టడంతో.. విపక్షాలు విమర్శలు గుప్పించాయి. దీంతో లోకేష్ రాబోయే ఎన్నికల్లో బరిలోకి దిగుతారని ప్రకటించారు. అయితే లోకేష్ కుప్పం లాంటి సేఫ్ నియోజకవర్గంలో బరిలోకి దిగుతారని అంతా భావించారు. కానీ చంద్రబాబు అనూహ్యంగా మంగళగిరి స్థానాన్ని లోకేష్ కి కేటాయించారు. మంగళగిరిలో టీడీపీ గెలిచి దాదాపు 30 ఏళ్ళు అయింది. ఇక్కడ టీడీపీకి అంతగా పట్టులేదు. అయితే 2014 ఎన్నికల్లో మాత్రం ఇక్కడ టీడీపీ మంచి ప్రభావం చూపింది. కేవలం 12 ఓట్ల తేడాతో ఓటమిపాలైంది. మంగళగిరి రాజధాని ప్రాంతానికి దగ్గర ఉండడంతో ఈ స్థానాన్ని చంద్రబాబు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అదీగాక సేఫ్ స్థానం నుంచి బరిలోకి దిగితే విపక్షాలు విమర్శలు చేసే అవకాశముంది. అదే మంగళగిరి లాంటి స్థానం నుంచి పోటీ చేసి, గెలిచి 30 ఏళ్ళ నియోజకవర్గ చరిత్రను తిరగరాస్తే లోకేష్ పొలిటికల్ కెరియర్ కి బోలెడంత మైలేజీ వస్తుందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి లోకేష్.. చంద్రబాబు ఊహించనట్లు మంగళగిరిలో సత్తా చాటుతారేమో చూడాలి.