సీమాంధ్రులపై కేటీఆర్ ప్రేమ.. నిజమెంత?

 

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడటంతో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తెరాస 100 సీట్లకు పైగా సాధించి మళ్ళీ తామే అధికారం చేపడతామని ధీమాతో అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు సిద్ధమైంది. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్, టీడీపీ, టిజెఎస్, సిపిఐ పార్టీలు మహాకూటమిగా ఏర్పడ్డాయో.. ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ప్రస్తుతం తెలంగాణలో 'తెరాస వర్సెస్ మహాకూటమి' పోరు నువ్వా నేనా అన్నట్టు సాగేలా కనిపిస్తోంది. దీంతో తెరాస.. మహాకూటమి మీద మాటల యుద్ధం మొదలుపెట్టింది.

'కాంగ్రెస్ సిగ్గులేకుండా టీడీపీ తో పెట్టుకుంది. మహాకూటమి గెలిస్తే జుట్టు చంద్రబాబు చేతిలో ఉంటుంది. మళ్ళీ తెలంగాణలో ఆంధ్రోళ్ల పెత్తనం వస్తుంది'. ఇలా తెరాస నేతలు ఏవేవో సంచలన వ్యాఖ్యలు చేసారు. ముఖ్యంగా కేసీఆర్, హరీష్ రావు లాంటి నేతలు కాంగ్రెస్, టీడీపీ పొత్తుని సహించలేక.. గతంలో లాగా మరొక్కసారి తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చాలనే ఉద్దేశంతో.. చంద్రబాబుని టార్గెట్ చేస్తూ శృతిమించిన వ్యాఖ్యలు చేసారు. అయితే ఈ వ్యాఖ్యలు తెరాసకు పెద్ద తలనొప్పిగా మారాయి. రాష్ట్రం ఏర్పడ్డాక ఇంకా అవే సెంటిమెంట్ మాటలా? అంటూ కొందరు అసహనం వ్యక్తం చేసారు. ఇక ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తెలంగాణలో సెటిల్ అయిన వారు.. తెరాస తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. అసలే గతంలో ఏపీకి ప్రత్యేకహోదా వస్తే తెలంగాణలోని కంపెనీలు ఏపీకి తరలిపోతాయంటూ వ్యాఖ్యలు చేసి.. ఏపీ ప్రజల ఆగ్రహానికి గురైన తెరాస నేతలు.. ఎన్నికల వేల చంద్రబాబు, ఆంధ్రోళ్ల పెత్తనం అంటూ వ్యాఖ్యలు చేసి ఇంకా ఆగ్రహం తెప్పించారు.

అయితే ఏమైందో ఏంటో సడెన్ గా తెరాస యూ టర్న్ తీసుకుంది. 'సీమాంధ్రులకు సోదరుడిలా అండగా ఉంటా.. అమరావతి నిర్మాణానికి వందకోట్లు ఇవ్వాలనుకున్నాం.. ఎన్టీఆర్ తెలుగు జాతికి గుర్తింపు తెచ్చారు.. హరికృష్ణ మరణసమయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందించిందో చూసారుగా'.. అంటూ ఏపీ మీద, ఏపీ ప్రజల మీద తమకు చాలా ప్రేమ ఉందని చెప్పే ప్రయత్నం చేసారు కేటీఆర్. అయితే కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడటంతోనే కేటీఆర్ లేనిప్రేమను ఒలకపోస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ ప్రక్కల ప్రాంతాల్లో సెటిలర్లు ఎక్కువుగా ఉంటారు. వీళ్ళు అనేక నియోజక వర్గాల్లో గెలుపుని ప్రభావితం చేయగలరు. వారిలో ఎక్కువగా టీడీపీని, చంద్రబాబుని అభిమానించే వారుంటారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించారో ఏంటో.. కేటీఆర్ ఇప్పుడు వారి మీద ప్రేమ చూపిస్తున్నారనే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే మొన్నటి వరకు తెరాస నేతలు చంద్రబాబు మీద విరుచుకు పడితే కేటీఆర్ మాత్రం ఆచితూచి అడుగులు వేశారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారనే చంద్రబాబుపై మా కోపం.. తెలుగు రాష్ట్రాలను కాంగ్రెస్, బీజేపీ కాకుండా ప్రాంతీయ పార్టీలు పాలించాలనేదే మా ధ్యేయం అన్నారు. అంతేనా అమరావతి నిర్మాణానికి రూ.100 కోట్లు ఇవ్వాలనుకున్నారట. కానీ కేంద్రం మట్టి, నీరు తప్ప ఏమివ్వట్లేదు అలాంటిది తెలంగాణ ప్రభుత్వం ఇస్తే బాగోదని ఆగిపోయారట. కాంగ్రెస్, బీజేపీ హవా ఉండకూడదు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా ఉండాలి.. అన్నదమ్ముల్లా కలిసుండాలి అని కేటీఆర్ అన్నారు.. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇవ్వట్లేదని వీరు కూడా ఇవ్వడం మానేశారంట!!.. ఇదేం లాజిక్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తెలుగు రాష్ట్రాలు ఒకరికొకరు అండగా ఉండాలన్నారు.. కానీ ప్రత్యేకహోదా వస్తే తెలంగాణ కంపెనీలు ఏపీకి తరలిపోతాయనే అపోహ ఎందుకు కలిగించారు?.. తెలంగాణ ఏర్పడి నాలుగైదు సంవత్సరాలు అవుతున్నా ఇంకా ఆంధ్రా పెత్తనం అని ఎందుకు అంటున్నారు? ఏపీ సీఎం మీద శృతిమించి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముంది? ఇలా పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మొత్తానికి ఎన్నికల సమయం దగ్గర పడటమే.. సెటిలర్ల విషయంలో కేటీఆర్ యూ టర్న్ తీసుకోవడానికి కారణం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.