అమీర్ పేట మెట్రో స్టేషన్ దగ్గర జరిగిన విషాదానికి కారణాలు ఇవేనా..?

 

అమీర్ పేట మెట్రో స్టేషన్ దగ్గర నిన్నరాత్రి విషాదం చోటు చేసుకుంది. అమీర్ పేట మెట్రో స్టేషన్ దగ్గర జోరుగా వర్షం కురుస్తుండటంతో, అప్పుడే తన సోదరితో కలిసి మెట్రో రైలు దిగిన ఓ యువతి తడవకుండా ఉండేందుకు మెట్రో పిల్లర్ కిందకు వెళ్లింది. కొద్ది సేపటికే పైనుంచి పెచ్చులు ఊడి నేరుగా ఆమె తలపై పడ్డాయి, అంతెత్తు నుంచి పడ్డ పెచ్చుల ధాటికి ఆమె తల పగిలిపోయింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.  వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆమె ప్రాణాలు విడిచింది.

అమీర్ పేట మెట్రో స్టేషన్ కింద చోటు చేసుకున్న ఈ ఘటన హైదరాబాదీలను భయపెడుతోంది. మృతురాలిని కూకట్ పల్లిలో నివాసముంటున్న మౌనికగా గుర్తించారు. మౌనికా స్వస్థలం మంచిర్యాల జిల్లా శ్రీరాం పూర్, భర్త కంతాల హరికాంత్ రెడ్డి, ఏడాది క్రితమే వీరికి వివాహమైంది. హరికాంత్ కు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో ఉద్యోగం రావటంతో ఆరు నెలల క్రితమే ఈ దంపతులు నగరానికొచ్చి కూకట్ పల్లి ఫేస్ త్రి ఎస్సార్ హోమ్స్ లో నివాసముంటున్నారు. తన చిన్నాన్న కూతురు నికితను అమీర్ పేటలో ని ఓ ప్రైవేట్ హాస్టల్లో చేర్పించేందుకు మౌనిక ఆదివారం మధ్యాహ్నం కూకట్ పల్లిలో మెట్రో రైలు ఎక్కింది. ఇద్దరూ కలిసి అమీర్ పేటలో దిగారు, వర్షం కురుస్తుండటంతో సారధీ స్టూడియో వైపు ఉన్న మెట్ల ద్వారా కిందకు దిగారు.

ఇద్దరు ఏ 1053 మెట్రో పిల్లర్ కింద నిలుచున్నారు, అనుకోకుండా మూడో అంతస్థులోని గోడకు చెందిన పెచ్చులు ఒక్క సారిగా ఊడి మౌనిక తలపై పడ్డాయి. తొమ్మిది మీటర్ల ఎత్తు నుంచి పెచ్చులు పడటంతో ఆమె తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఆమె సోదరి, స్థానికుల్లో కొందరు కలిసి బాధితురాల్ని ఓ ఆటోలో హుటాహుటిన దగ్గర్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మౌనిక మృతి చెందినట్టు నిర్ధారించారు. సోదరిని హాస్టల్లో చేర్పించి గంటలో తిరిగి వస్తారని తనతో చెప్పి వెళ్లిన భార్య కొద్ది సేపటికే తిరిగి రాని లోకాలకు వెళ్లిందని తెలిసి మౌనిక భర్త హరికాంత్ రెడ్డి షాక్ కు గురయ్యాడు, మృతదేహం వద్ద బోరున విలపించాడు.

పెళ్లైన సంవత్సరానికే తనను వీడి వెళ్లిపోయావా అంటూ అతడు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడిపెట్టించింది. సర్ఫేస్ వాల్ నుంచి చిన్న ప్లాస్టర్ ముక్క పడిందనీ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. తొమ్మిది మీటర్ల ఎత్తు నుంచి పడటంతో ఆమె తీవ్రంగా గాయపడి చనిపోయిందని చెప్పారు. ఇలాంటి ఘటన దురదృష్టకరమన్నారు, మౌనిక కుటుంబానికి పరిహారమివ్వాలని ఎల్ అండ్ టీ మెట్రో సంస్థకు ఎన్వీఎస్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ కే తలమానికంగా ఉన్న మెట్రో రైలుకు సంబంధించి జరిగిన ఈ దుర్ఘటన నగర వాసులను భయపెడుతోంది.

హైదరాబాదీల జీవితంలో భాగమైన మెట్రో రైల్లో ప్రమాదం జరగటం ప్రజలల్ని ఆందోళనకు గురిచేస్తోంది. మెట్రో నిర్మాణంలో లోపాలకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. హడావుడిగా మెట్రో నిర్మాణాన్ని ముగించటం, ప్రీ కాస్ట్ విధానంలో నిర్మించిన పిల్లర్లు, వాటిపైన ఏర్పాటు చేపట్టిన వడయాక్ట్ సిగ్మెంట్ల మధ్య ఖాళీ ప్రదేశాన్ని పటిష్ఠంగా మూసివేయకపోవడం, ఇప్పటికీ రవాణా కొనసాగుతున్న స్టేషన్ల దగ్గర ఇంకా నిర్మాణ పనులు కొనసాగిస్తూనే ఉండడం, మెట్రో రైళ్లు పరిగెత్తే సమయంలో పిల్లర్ల వణకడం, ప్రీ కాస్ట్ కాంక్రీటు నిర్మాణానికి దానిపైన చేసిన సిమెంట్ బాండింగ్ కి మధ్య పటిష్టంగా లేకపోవడం ఈ పెచ్చులూడటానికి కారణంగా తెలుస్తోంది.