చంద్రబాబుకి కొత్త తలనొప్పి.. వైసీపీలోకి రాయపాటి?

 

టీడీపీ సత్తెనపల్లి నియోజకవర్గం అభ్యర్థి విషయంలో చిచ్చు రాజుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కోడెల శివప్రసాద రావు మళ్లీ సత్తెనపల్లి నుంచి తానే అభ్యర్థినని ఇప్పటికే ప్రకటించుకున్నారు. ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించారు. అయితే.. ఇదే సీటును నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు తన కుమారుడికి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. ఇవ్వని పక్షంలో ఆయన పార్టీ మారతారని ప్రచారం కూడా జరుగుతోంది. అయితే.. రాయపాటి ప్రతిపాదనపై కోడెల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న స్థానాన్ని కేటాయించమని ఎలా అడుగుతారని ఆయన రాయపాటిని సూటిగా ప్రశ్నించారు.

సత్తెనపల్లి నియోజకవర్గంలో కోడెల శివప్రసాదరావుకు వ్యతిరేకంగా టీడీపీలోని ఓ వర్గం నేతలు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. కోడెల వద్దు అంటూ ప్ల కార్డులు ప్రదర్శించారు. ఈ పరిణామాలపై కోడెల స్పందిస్తూ.. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను తాను వివాదం చేయబోనని చెప్పారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారితో తాను స్వయంగా మాట్లాడుతానని అన్నారు. ఈ రకమైన ఆందోళనలు పార్టీకి నష్టం చేస్తాయని అభిప్రాయపడ్డారు. తాను సత్తెనపల్లి నుండి పోటీ చేయకూడదని చెబుతున్న వారంతా కారణం మాత్రం చెప్పడం లేదన్నారు. తనకు వ్యతిరేకంగా సత్తెనపల్లిలో నిరసనలు చేయడం బాధ కల్గించిందన్నారు. కుట్రపూరితంగానే కొందరు ఈ నిరసనలు చేయిస్తున్నారని కోడెల ఆరోపించారు. సత్తెనపల్లిని ప్రపంచపటంలో పెట్టిన ఘనత  తనదని ఆయన చెప్పారు. 15వేల మెజారిటీతో తాను విజయం సాధిస్తానని కోడెల ధీమా వ్యక్తం చేశారు.

అనారోగ్యం కారణంగా రాయపాటి సాంబశివరావుకు నర్సరావుపేట ఎంపీ స్థానం కేటాయింపు విషయమై చంద్రబాబు వెనకడుగు వేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నర్సరావుపేట ఎంపీ స్థానం నుండి  తాను పోటీ చేసేందుకు రాయపాటి సాంబశివరావు సుముఖంగా ఉన్నా కూడ చంద్రబాబు ఈ విషయమై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. దీంతో తనకు నర్సరావుపేట ఎంపీ స్థానం ఇవ్వకపోతే తన కొడుకుకు సత్తెనపల్లి అసెంబ్లీ స్థానాన్ని ఇవ్వాలని రాయపాటి పట్టుపడుతున్నారు. అయితే సత్తెనపల్లి నుండి తాను పోటీ చేస్తున్నట్టుగా కోడెల ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాయపాటి సాంబశివరావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. మరోవైపు ఆయనకు వైసీపీ నేతలు టచ్ లోకి వచ్చారని, ఆయన వైసీపీలో చేరే అవకాశముందని కూడా వార్తలొస్తున్నాయి. మరి ఈ వివాదానికి చంద్రబాబు ఎలా చెక్ పెడతారో చూడాలి.