ఏపీలో కొత్త పుంతలు తొక్కుతున్న జంపింగ్ పాలిటిక్స్ !

 

ఏపీ రాజకీయాలు రకరకాల మలుపులు తిరుగుతున్నాయి. ఎక్కడైనా నాయకులు పార్టీ మారుతున్నారు అంటే అది అధినేతకు చెప్పకుండా సైలెంట్ గా వెళ్ళిపోయి పార్టీలో చేరి పాత అధినేత మీద రకరకాల ఆరోపణలు చేస్తారు. కానీ ఏపీలో మాత్రం పార్టీ మారుతున్నామని పార్టీ అధినేత దగ్గరకి వెళ్లి మరీ చెప్పి వస్తున్నారు. ఈ వింత పరిస్థితి తెలుగు దేశం పార్టీలో నెలకొంది. గత ఎన్నికల ముందు వరకూ మేమే రాజులం మేమే మంత్రులం అన్నట్టు ఏపీలో అధికారాన్ని చెలాయించిన ఆ పార్టీ నేతలు, ఇప్పుడు అధికారం కోల్పోవడంతో ఒక్కసారిగా రోడ్డున పడిపోయిన ఫీలింగ్ లో ఉన్నారు. 

దానికి తోడు గత ప్రతిపక్షం ఎక్కడ తమను టార్గెట్ చేస్తుందో అనే భయంలో ఉన్న్నారు. ఇక వ్యాపారాలు ఉన్న నేతల సంగతి వర్ణనాతీతం. అందుకే వారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్నారు. ఇప్పాతికే ఆ పార్టీ నుండి నలుగు ఎంపీలు పార్టీ మారి బీజేపీలోకి వెళ్ళగా ఇప్పుడు మరో సీనియర్ నేత కూడా పార్టీ మారే యోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. సీనియ‌ర్ నాయకుడు ప్రస్తుతం టీడీపీ నేత‌గా ఉన్న రాయ‌పాటి సాంబ‌శివ‌రావు టీడీపీ వీడి బీజేపీలో చేరేందుకు రంగం సిద్దమైంది ! 

రెండు మూడు రోజుల్లో రాయ‌పాటి బీజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా స‌మ‌క్షంలో బీజేపీలో చేర‌నున్నట్లు స‌మాచారం. రాయ‌పాటి బీజేపీలో చేర‌టం ద్వారా ఆయ‌న‌కు గుంటూరు జిల్లాలో ఉన్న అనుచర వ‌ర్గం మొత్తంగా బీజేపీలో చేరే అవ‌కాశం క‌నిపిస్తోంది. దీని పైన రాయ‌పాటి ఒక‌టి రెండు రోజుల్లో అధికారికంగా ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారని అంటున్నారు. ఈ చేరికల విషయంలో కీలక పాత్ర పోషిస్తున్న రామ్ మాధవ్ రాయపాటి ఇంటికి వచ్చి తమ పార్టీలో చేరాలని ఆయనను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. 

కొద్ది రోజుల్లోనే తాను ఢిల్లీ వస్తానని... అక్కడ మరిన్ని విషయాలు మాట్లాడతానని రాయపాటి రామ్ మాధవ్‌కు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఆయనతో చర్చలు జరుపుతున్న ఫొటోలు సైతం కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తనతో బీజేపీ దూత వచ్చి పార్టీలోకి రావాలని కోరిన విషయాన్ని రాయపాటి సాంబశివరావు స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారని టాక్. 

ఢిల్లీలో తాను నివాసం ఉంటున్న ఇంటి వ్యవహారంతో పాటు పోల‌వ‌రం సమస్యలను వివరించి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరాల్సిన ఆవశ్యకత గురించి వివరించినట్లు సమాచారం. పోల‌వ‌రం నిర్మాణం మీద ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి నిపుణుల క‌మిటీ వేయ‌టం..రివ‌ర్స్ టెండ‌రింగ్ దిశ‌గా అడుగులు వేస్తున్న క్ర‌మంలో ఆ కాంట్రాక్ట్ చేస్తున్న తను మ‌రింత‌గా ఆర్దికంగా న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంద‌ని చెప్పారట. ఈ నేపధ్యంలో రాయ‌పాటి టీడీపీ వీడి బీజేపీలో చేరటం ఖాయ‌మైందని అంటున్నారు.