ప్రతీదీ సీమాంధ్రుల కుట్రేనా?

 

 

 

విభజన వాదులకు తమకు అనుకూలంగా లేని ప్రతి విషయాన్నీ సీమాంధ్రుల కుట్రగా అభివర్ణించడం సాధారణమైపోయింది. రాష్ట్ర విభజనకు సంబంధించి తమకు వ్యతిరేకంగా ఏ చిన్న పరిణామం జరిగినా దాన్ని ‘సీమాంధ్రుల కుట్ర’ అనడానికి టీఆర్ఎస్ నాయకుల దగ్గర్నుంచి ఏ పార్టీకి చెందిన నాయకుడైనా ఎంతమాత్రం మొహమాటపడటం లేదు. గతంలో తెలంగాణవాదులు ఎన్నిసార్లు, ఎన్ని సందర్భాలలో ‘సీమాంధ్రుల కుట్ర’ అనే మాటను ఉపయోగించాలో చెప్పాలంటే పెద్ద భారతమంత గ్రంథం రాయాల్సి వుంటుంది.

 

రాష్ట్రాన్ని విభజించొద్దు మహాప్రభో అని సీమాంధ్రులు కేంద్ర ప్రభుత్వంతో మొరపెట్టుకోవడం కూడా ‘సీమాంధ్రుల కుట్ర’ అకౌంట్‌లో పడిపోతోందంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. మొన్నామధ్య శాంతిభద్రతలకు సంబంధించి ఐపీఎస్ అధికారి విజయకుమార్ నాయకత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ఎందుకోగానీ పేర్వారం రాముల్ని మీటింగ్‌కి పిలవలేదు. అది కూడ సీమాంధ్రుల కుట్రే అయి కూర్చుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం రాయల తెలంగాణ వైపు మొగ్గు చూపుతోందన్న వార్తలు వస్తున్నాయి.  దీన్ని కూడా తెలంగాణవాదులు సీమాంధ్రుల కుట్రగానే డిసైడ్ చేసేశారు. ఇలా ప్రతిదాన్నీ ‘సీమాంధ్రుల కుట్ర’ అనడంలో విభజనవాదుల వితండవాద ధోరణి బయటపడుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.



కేంద్రం తమకు వ్యతిరేకంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటోందని భావిస్తే దాన్ని ఎదుర్కోవడంలో తప్పులేదుగానీ, ప్రతిదాన్నీ సీమాంధ్రుల కుట్రగా అభివర్ణిస్తూ సీమాంధ్రులను అవమానిస్తున్నట్టు మాట్లాడ్డం భావ్యం కాదని విశ్లేషకులు అంటున్నారు. తమకు ఎదురైన సమస్య లోత్లులోకి వెళ్ళి విశ్లేషించుకోవడం, ఆత్మపరిశీలన చేసుకోవడం, సహేతుకంగా మాట్లాడ్డం మానేసి నోటికొచ్చిన ఆరోపణలు చేయడం భావ్యం కాదని అంటున్నారు. రాయల తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం సీమాంధ్రులకు ఎంతమాత్రం ఇష్టం లేదు. రాయలసీమ వాసులైతే ఈ ప్రతిపాదనను ఒక అర్థంపర్థం లేని ప్రతిపాదనగా పేర్కొంటూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ‘రాయల తెలంగాణ’ రాయిని సీమాంధ్రుల నెత్తిన వేయడం విభజనవాదులకు భావ్యం కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.