రాయల తెలంగాణా తెరపైకి ఎందుకు వచ్చిందంటే

 

కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన చేసేందుకు సిద్దమయినప్పుడు ‘రాయల తెలంగాణ’ ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. కానీ అసలు రాష్ట్ర విభజనకే అంగీకరించమని సీమాంధ్రలో మొదలయిన ఉద్యమాల ఒత్తిడితో, పది జిల్లాల తెలంగాణా తప్ప వేరే ఏ ప్రతిపాదనకు అంగీకరించబోమని తెలంగాణావాదులు గట్టిగా నిలబడటంతో, రాయల తెలంగాణా ప్రతిపాదన తెర వెనక్కు వెళ్లిపోయింది.

 

అయితే సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమాలు చల్లబడటం, అదే సమయంలో తెలంగాణా ఖాయమనే ఉద్దేశ్యంతో తెలంగాణావాదులు వెనక్కి తగ్గడంతో, విభజన ప్రక్రియ జోరందుకొంది. ఆ సమయంలో సీమాంధ్రకు ప్యాకేజీలు సాధించుకోనేందుకు కాంగ్రెస్ నేతల ఒత్తిడి పెరిగింది. వారిలో కొందరు హైదరాబాద్, భద్రాచలం, నదీ జలాలు వంటి అంశాలపై గట్టిగా పట్టుబట్టడంతో కాంగ్రెస్ అటువైపుకు మొగ్గడం చూసి, వెంటనే తెలంగాణా నేతలు కూడా ఒత్తిడి పెంచారు.

 

ఈసమస్యల నుండి గట్టెక్కాలంటే మధ్యే మార్గంగా రాయల తెలంగాణా ఒక్కటే చక్కని పరిష్కారమని కొందరు సీమ నేతలు కాంగ్రెస్ అధిష్టానానికి బ్రెయిన్ వాష్ చేసారు. ఆ ప్రతిపాదనకు మరికొందరు నేతల మద్దతు కూడగట్టడమే కాకుండా, అందుకు అనుగుణంగా కొందరు నేతలు అనంతపురం, కర్నూలు జిల్లాల నుండి 1500 గ్రామ పంచాయితీ తీర్మానాలు చేసి కేంద్రమంత్రుల బృందం ముందుంచి, తమ రెండు జిల్లాలను తెలంగాణా కలిపితే ఆ రెండు జిల్లాల ప్రజలకు లాభమే తప్ప నష్టం ఉండదు గనుక ఎవరూ దానిని వ్యతిరేఖించరని వారు భరోసా ఇచ్చారు.

 

సీమాంధ్రలో మిగిలిన ప్రాంతలకంటే అన్ని విధాల వెనుకబడి, విద్యా ఉద్యోగాలకు హైదరాబాద్ పైనే ప్రధానంగా ఆధారపడిన ఆ రెండు జిల్లాల ప్రజలు కూడా ఈ ప్రతిపాదనకు సానుకూలత చూపుతుండటంతో జనం నాడి పసిగట్టిన మిగిలిన నేతలు కూడా క్రమంగా రాయల తెలంగాణా ప్రతిపాదనకు మొగ్గు చూపడంతో, అప్పటికే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేస్తున్న సమైక్యవాదంతో ఇబ్బంది పడుతున్నకాంగ్రెస్ అధిష్టానానికి, ఈ ప్రతిపాదన ఒకే చేస్తే దాదాపు 28మంది సీమ కాంగ్రెస్ నేతలు కిరణ్ శిభిరం నుండి విభజనకి ‘సై’ అంటూ తెలంగాణా బిల్లుని శాసనసభలో ఆమోదం పొందేలా చేయగలమని హామీ ఈయడంతో ఇక కాంగ్రెస్ దీనికే ఫిక్స్ అయిపోయింది.

 

ఈవిధంగా చేస్తే హైదరాబాద్ పై సీమాంధ్ర నేతలు ఇక పట్టుబట్టబోరు గనుక తెలంగాణావాదులు కూడా దీనికి అభ్యంతరం చెప్పరని కాంగ్రెస్ భావించింది.అంతే గాక ఈ ప్రతిపాదనతో తన రాజకీయ ప్రత్యర్ధులైన తెరాస, తెదేపా, వైకాపా, బీజేపీ అందరికీ ఒకేసారి ఎసరు పెట్టేయవచ్చని గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం ఈ ‘సర్వరోగనివారిణి’ని మళ్ళీ తెరపైకి తెచ్చింది.