రాయల తెలంగాణతో సీమ ప్రజలకు వెన్నుపోటు

 

నాణేనికి ఒకవైపే చూసిన కాంగ్రెస్ పార్టీ, తెరాస నేతలు, టీ-కాంగ్రెస్ నేతలు, తెలంగాణా ప్రజలు, బైరెడ్డి వంటి అసలు సిసలయిన సీమ నేతలను, రాయలసీమలో మిగిలిన ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా తన రాజకీయ ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచించుకొంటూ అడుగు ముందుకు వేసింది. తత్ఫలితం ఏవిధంగా ఉంటుందో ప్రత్యక్షంగా కనబడుతోందిప్పుడు.

 

తామే అసలు సిసలయిన రాయలసీమ ప్రతినిధులమని జేసి దివాకర్ రెడ్డి వంటి వారు తమ భుజాలు తామే చరుచుకొంటున్నారు. ఇప్పుడు కేంద్రం కూడా తమ ప్రతిపాదనకు మొగ్గు చూపడంతో తమ ప్రయత్నాలు ముమ్మరం చేసారు కూడా.

 

అయితే, రాయలసీమలో మిగిలిన జిల్లాల ప్రజల మనోభావాలను, వారి అవసరాలను ఏ మాత్రం పట్టించుకోకుండా తమ స్వార్ధ రాజకీయ వ్యాపార ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, ఒక గొప్ప, బలమయిన సంస్కృతిగల తమ రాయలసీమలో కొంత ముక్కను చీల్చుకొని తమ సంస్కృతికి, బాషకి, యాసకి, ఆచార వ్యవహారాలకి, జీవన శైలికి పూర్తి విరుద్దమయిన తెలంగాణాలో కలిసేందుకు సిద్దమయిపోయారు.

 

ఇంతకంటే బైరెడ్డి వంటి వారు కోరుతున్నట్లుగా ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాన్నిఅడిగినా న్యాయంగా ఉండేది. లేకుంటే తమ కర్నూలులో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మించాలని డిమాండ్ చేసినా ఎవరికీ అభ్యంతరం ఉందేది కాదు. కానీ, తమ స్వార్ధ రాజకీయ వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవడానికి సదరు నేతలు తమ రాయలసీమకు కూడా వెన్నుపోటు పొడవడానికి వెనకదకపోవడం చాలా విచారకరం.

 

సీమ ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా ఇటువంటి నేతల సలహాలను కాంగ్రెస్ అధిష్టానం చెవికెక్కించుకోవడం అంతకంటే పెద్ద తప్పు. దాని ఫలితమే ఇప్పుడు కళ్ళెదుట కనబడుతోందిప్పుడు.

 

సమయం కాని సమయంలో రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలుపెట్టి పెద్ద తప్పు చేసిన కాంగ్రెస్ అధిష్టానం రాయల తెలంగాణా ప్రతిపాదనతో ఇప్పుడు రెండో తప్పు చేస్తోంది. అందుకు ఆ పార్టీ ఫలితం అనుభవించక తప్పదు.