విజయమే ప్రతీకారానికి సమాధానం

ఉపకారికి నుపకారము

విపరీతముగాదు సేయ వివరింపంగా

నపకారికి నుపకారము

నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ!

అన్న సుమతీ శతకంలోని పద్యం చిన్నప్పుడు మనం చదివాం. ఈ పద్యం అర్థం  మేలు చేసిన వానికి మేలు చేయుట గొప్ప కాదు. హాని చేసిన వానికి అంతకుముందు వాడు చేసినదోషాలను లెక్కచేయక ఉపకారం చేసేవాడే నేర్పరి అని ఈ పద్యానికి అర్థం. ఈ కాలంలో అలాంటి వారు ఎవరుంటారు అని అనుకుంటాం. కానీ, మానవత్వం, మంచితనం ఉన్నవారు ఏ కాలంలోనైనా ఉంటారు. అయితే వారి సంఖ్య పరిమతంగా ఉండోచ్చు. ఎందుకంటే ఇది కలికాలం కదా.  సరే ఇక అసలు విషయానికి వస్తే..

 

వ్యాపార సంస్థల మధ్య పోటీ ఉంటుంది. కొన్నిసార్లు అది కాస్త పెరిగి ప్రతీకారంగా మారుతుంది. అయితే వ్యాపార ఒప్పందం కోసం పిలిచి అవమానపరిచిన ఒక సంస్థతో తిరిగి తొమ్మిదేళ్ల తర్వాత నష్టాల్లో ఉన్న ఆ సంస్థ ఉత్పత్తులను కొనుగోలు చేసి తన ఔదార్యం చాటుకున్న పారిశ్రామిక వేత్త రతన్ టాటా.  ప్రతీకారం అంటే అందనంత ఎత్తుకు ఎదగడమే అని కొత్త అర్థం చెప్పారు. ఎదుటివారిపై పగ సాధించడం అంటే విజయం సాధించడమే అని నిరూపించారు. మేలు చేసిన వానికి మేలు చేయుట గొప్ప కాదు. హాని చేసిన వానికి అంతకుముందు వాడు చేసిన దోషాలను లెక్కచేయక ఉపకారం చేసేవాడే నేర్పరి అన్న సుమతీ శతకంలోని నీతిని అక్షరాల పాటించారు. 

 

రతన్ టాటా భారతీయ వ్యాపార సామ్రాజ్యంలో పరిచయం అవసరం లేని పేరు. జంషెడ్‌జీ నుసెర్వాన్‌జీ టాటా వంశంలో జన్మించారు. 1962లో టాటా స్టీల్ జంషెడ్ పూర్ ప్లాంట్‌లో అప్రెంటిస్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 1868లో స్థాపించబడిన టాటా గ్రూప్ కు ఐదో చైర్మన్ గా  1991లో  జెఆర్‌డి టాటా నుంచి బాధ్య తలను స్వీకరించారు. అప్పట్లో 10 వేల కోట్ల రూపాయల టర్నోవర్ గల టాటా గ్రూప్ ను అంతర్జాతీయ కార్పోరేట్ సంస్థ స్థాయికి తీసుకువెళ్లారు. ఈ సంస్థ టర్నోవర్ నేడు 100 బిలియన్ డాలర్లకు పెరిగింది. టర్నోవర్‌లో 58 శాతం ఎగుమతుల ద్వారానే వస్తోంది. రతన్ టాటా నిరంతరాయంగా, అవిశ్రాంతంగా చేసిన కృషి ఫలితమే ఇది. టాటా గ్రూపును ఆయన విదేశాలకు కూడా విస్తరింపజేశారు.

 

టాటా గ్రూప్‌లో మొత్తం 32 పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. వీటి ఉమ్మడి మార్కెట్ క్యాప్ 8,882 కోట్ల డాలర్లు. మొత్తం షేర్ హోల్డర్ల సంఖ్య 38 లక్షలు. ఉద్యోగుల సంఖ్య 4.50,000. లిస్టెడ్ కంపెనీల్లో టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కన్సల్టెన్సీ, టాటా పవర్, టాటా కెమికల్, టాటా గ్లోబల్ బేవరేజెస్, టాటా టెలీ, టైటాన్, టాటా కమ్యూనికేషన్స్, ఇండియా హోటల్స్ వంటి టాప్ కంపెనీలు ఉన్నాయి. గ్రూప్ వ్యాపారం 80 దేశాలకు విస్తరించి ఉంది. 85 దేశాలకు టాటా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి.

 

టాటా గ్రూప్ ఛైర్మన్ గా రెండు దశాబ్దాలకు పైగా పనిచేసిన ఆయనలోని వ్యాపార దక్షతకు, మానవీయతకు దర్శణం ఫోర్డ్ సంస్థతో జరిగిన ఒప్పందం.
స్టీల్, కెమికల్, మోటార్స్ ఇలా అనేక ఉత్పత్తులను దేశీయంగా తయారుచేస్తూ లక్షలాది మందికి ఉపాధి కల్పించిన  ఘనత రతన్ టాటాదే. భారతదేశంలో ట్రక్ ల తయారీలో అగ్రగామి టాటా మోటర్స్. వస్తువుల రవాణాకే పరిమితం కాకుండా  కార్లను కూడా తయారు చేయాలని సంకల్పించారు. అందుకు ఫలితంగా 1998 చివరి నాటికి టాటా ఇండికా అందుబాటులోకి తీసుకువచ్చారు. టాటా ఇండికా మొదటి స్వదేశీ మోడ్రన్ కారు. ఇది రతన్ టాటా డ్రీమ్ ప్రాజెక్ట్. దీనిని నిజం చేయడం కోసం ఆయన రాత్రింబవళ్ళు కష్టపడ్డారు. ఫలితంగా టాటా ఇండికా మార్కెట్ లోకి విడుదల చేశారు.  ఇది భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఒక విప్లవాత్మక అంశంగా మారింది. అయితే  కార్ల అమ్మకాలు ఆయన అంచనాకు తగ్గట్టుగా జరగలేదు. దాంతో ఈ ప్రాజెక్ట్ ను వేరే మోటార్ కంపెనీ అమ్మాలని టాటా గ్రూప్ నిర్ణయించింది. 1999లో ఫోర్ట్ కంపెనీ టాటా ఇండియా ప్రాజెక్ట్ కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరిచింది. ముంబాయిలోని టాటా గ్రూప్ కార్యాలయంలో చర్చలు జరిపిన తర్వాత డెట్రాయిట్ లోని తమ ప్రధానకార్యాలయానికి టాటాగ్రూప్ చైర్మన్, ఇతర సభ్యులను ఆహ్వానించారు. రతన్ టాటా తన బృందంతో డెట్రాయిట్ లోని ఫోర్డ్ ఆఫీస్ కు చేరుకున్నారు. మూడు గంటల పాటు అక్కడ నిరీక్షించిన తర్వాత మీటింగ్ ఏర్పాటు చేసిన ఫోర్డ్ కంపెనీ ఛైర్మన్ బిల్ ఫోర్డ్ మీకు ఎం తెలుసని ప్యాసింజర్ కార్ల ఉత్పత్తి ప్రారంభించారు. మీ కార్లను కొలుగోలు చేసి మీకు పెద్ద సహాయం చేస్తున్నాం అంటూ రతన్ టాటాతో వ్యాఖ్యానిస్తాడు. ఆ మాటలను అవమానకరంగా భావించిన రతన్ తమ కార్ల ప్రాజెక్టును అమ్మడం లేదని చెప్పి,  ఒప్పందం చేసుకోకుండానే తన బృందంతో తిరిగి ముంబాయి చేరుకుంటారు. అదే రోజు కార్ల తయారీ ప్రాజెక్ట్ ను అమ్మకూడదని నిర్ణయించుకుని తన పూర్తి దృష్టిని కార్ల పరిశ్రమపై పెట్టారు. ఆ తర్వాత కొద్దికాలంలోనే ప్రపంచంలోని  ఆటోమొబైల్ రంగంలో టాటా కార్స్ మంచి పేరు సాధించాకున్నాయి.

 

2008లో టాటా మోటర్స్ బెస్ట్ సెల్లింగ్ కంపెనీగా మార్కెట్ లో నిలిచింది. అదే సమయంలో ఫోర్డ్ కంపెనీ నష్టాల బాటలో పడింది. ఫోర్డ్ కార్ల అమ్మకాలు బాగా తగ్గిపోవడంతో నష్టాల ఊబిలో చిక్కిన ఆ సంస్థ కార్లు జాగ్వార్, ల్యాండ్ రోవర్ కొనుగోలు చేస్తామని ఫోర్డ్ సంస్థకు ఆఫర్ ఇచ్చారు. ఈ రెండు కార్ల ప్రాజెక్ట్ ను అమ్మడం ద్వారా తమ సంస్థ నష్టాలను తగ్గించుకునే ప్రయత్నంలో ఫోర్డ్ చైర్మన్ బిల్ ఫోర్డ్ తమ బృందంలో ముంబాయిలోని టాటా కార్స్ ఆఫీస్ కు చేరుకున్నారు. మా రెండు కార్ల ప్రాజెక్ట్ ను కొలుగోలు చేయడం ద్వారా మీరు మాకు పెద్ద సహాయం చేస్తున్నారు అంటూ బిల్ ఫోర్డ్ రతన్ టాటాకు ధన్యవాదాలు చెప్పాడు. ఫోర్డ్ కంపెనీ ఐకాన్ గా భావించే జాగ్వార్ ల్యాండ్-రోవర్ బ్రాండ్‌లను 2.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు రతన్ టాటా. బిల్ ఫోర్డ్ మాదిరిగా అవమానకరంగా మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ  రతన్ టాటా హుందాగానే వ్యవహరించారు. తొమ్మిది సంవత్సరాల తక్కువ సమయంలోనే ఆటోమొబైల్ రంగంలో తన సత్తా చాటి ఫోర్డ్ లాంటి సంస్థను నష్టాల బారిన నుంచి రక్షించిన ఘనత రతన్ టాటాది. ఈ సంఘటన ఆయనలోని మానవత్వానికి, దార్శనికతకు దర్పణం పట్టే అనేక సంఘటనల్లో ఒకటి మాత్రమే.

 

భారతదేశంలో ఎక్కువ మంది ఇష్టపడుతున్న కార్లలో ఈ రెండు బ్రాండ్ కార్లు కూడా చేరాయి. ప్రపంచంలోని ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్స్ ప్రముఖ సంస్థగా మారింది. మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే ధరలో నానో కార్లను తయారు చేసిన టాటా గ్రూప్ తమ లాభాల్లో 66శాతం ఛారిటీ కార్యక్రమాలకే వినియోగిస్తోంది. కరోనా మహమ్మారి నియంత్రణ చర్యలకు 1500కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించింది.