రాష్ట్రపతి భవన్… మీకు తెలియని 10 విశేషాలు!

 

ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా… అమెరికన్ ప్రెసిడెంట్ అంత పవర్ ఫుల్ కాదు. అలాగని భారత రాష్ట్రపతి గౌరవానికి కొదవ వుంటుందా అంటే… అస్సలు వుండదు! అసలైన పనంతా చేసేది ప్రధాని అయినా సంతకం చేసి అధికార ముద్ర వేసేది ప్రథమ పౌరుడే! అటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అయిదేళ్లు ఆతిథ్యం ఇస్తుంది… దిల్లీలోని రాష్ట్రపతి భవన్! ఇక ఇప్పుడు పద్నాలుగవ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కోసం ఎదురు చూస్తోన్న ఆ చారిత్రక భవనం విశేషాలు మీకు తెలుసా?

 

1.     మన రాష్ట్రపతి భవన్ ప్రపంచంలోనే రెండవ అత్యంత పెద్దదైన ప్యాలెస్. మొదటిది ఇటలీలోని రోమ్ లో వున్న క్విరినల్ ప్యాలెస్!

 

2.    రాష్ట్రపతి భవన్ రూపకర్త బ్రిటీష్ వాడైన సర్ ఎడ్విన్ ల్యూటెయిన్స్. ఆయనతో పాటూ చీఫ్ ఇంజనీర్ హగ్ కీలింగ్, చాలా మంది భారతీయ కాంట్రాక్టర్లు కూడా భవన నిర్మాణంలో పాలుపంచుకున్నారు.

 

3.    ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నిర్మాణం 1912లో ప్రారంభమై 1929దాకా కొనసాగింది! మొత్తం 29వేల మంది కార్మికులు రూపకల్పనలో పాల్గొన్నారు!

 

4.    దాదాపు 9లక్షల పౌండ్లు, అంటే పదమూడు మిలియన్ల మేర ఖర్చైన రాష్ట్రపతి భవనం ప్రారంభోత్సవం…. 1931లో జరిగింది!

 

5.    2లక్షల చదరపు అడుగుల విస్తీర్ణమున్న రాష్ట్రపతి ఆవాసం మొత్తం 340రూములతో ఆశ్చర్యం కలిగిస్తుంటుంది! అందులో 54బెడ్ రూములే వుంటాయి. అవి కాక అతిథుల కోసం ఇంకా అనేక గదులు, సౌకర్యాలు ఇక్కడ వుంటాయి!

 

6.    700మిలియన్ల …. అంటే 70కోట్ల ఇటుకలు రాష్ట్రపతి భవన్ నిర్మాణానికి ఉపయోగించారట! అయితే, విచిత్రం ఏంటంటే… ఈ మహానిర్మాణానికి ఎక్కడా ఉక్కు వాడలేదు!

 

7.    1950లలో దీన్ని వైస్రాయ్ హౌజ్ అనేవారు. అప్పట్లో భారత వైస్రాయ్ ఇక్కడ వుండేవాడు. తరువాతి కాలంలో రాష్ట్రపతి మకాంగా మారిన వైస్రాయ్ హౌజ్ లో మొఘల్, బ్రిటీష్ కాలాల నిర్మాణ శైలి మనకు కలగలిపి కనిపిస్తుంది…

 

8.    1931లో భవనం ప్రారంభమయ్యాక తొలిసారి అందులో వున్న బ్రిటీష్ అధికారి లార్డ్ ఇర్విన్.

 

9.    రాష్ట్రపతి భవన్ ప్రధాన భవంతికి పశ్చిమాన మొఘల్ గార్డెన్ వుంటుంది. దీన్ని సర్ ల్యూటెయిన్సే రూపొందించాడు. పచ్చటి చెట్లతో, రంగురంగుల గులాబీలతో, ఇంకా ఎన్నో రకాల పూలు, మొక్కలతో మొఘల్ గార్డెన్ రాష్ట్రపతి భవన్ కే తలమానికంగా గుభాళిస్తూ వుంటుంది!

 

10.  అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య సామాన్య సందర్శకులకి మొఘల్ గార్డెన్ చూసే అవకాశం ఫిబ్రవరీ, మార్చ్ నెలల్లో కల్పిస్తారు!