పవన్ పై రాపాక సంచలన వ్యాఖ్యలు.. డౌట్ లేదు.. వైసీపీలో చేరడం ఖాయం!!

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన గెలిచిందే ఒక్క ఎమ్మెల్యే సీటు అంటే... అసలు గెలిచిన ఆ ఒక్క ఎమ్మెల్యే తమ వైపు ఉన్నాడో లేడో అర్థంగాక అటు జనసేనాని పవన్ కళ్యాణ్, ఇటు జన సైనికులు తలలు పట్టుకుంటున్నారు. జనసేన ఒక్కగానొక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ తీరు ఆ పార్టీని కలవరపెడుతోంది. ఎమ్మెల్యే రాపాక పేరుకి జనసేనలో ఉన్నా... ఆయన వ్యాఖ్యలు మాత్రం పూర్తిగా అధికార పార్టీ వైసీపీకి లాభం చేకూర్చేలా ఉంటున్నాయి. ఒకసారి అసెంబ్లీ సాక్షిగా సీఎం వైఎస్ జగన్ ని దేవుడు అని ఆకాశానికెత్తారు. మరోసారెమో జగన్ ఫోటోకి పాలాభిషేకం చేసారు. ఈ చర్యలతో రాపాక పార్టీ మారతారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే రాపాక పార్టీ మారలేదు, ఆయన తీరూ మార్చుకోలేదు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశ పెడుతూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిని పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం పెడితే ఓకే.. కానీ తెలుగు మీడియంని పూర్తిగా తొలగించడం ఏంటని పవన్ మండిపడుతున్నారు. తెలుగు బాషని కాపాడాలంటూ.. పవన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అయితే రాపాక మాత్రం.. అసెంబ్లీలో ఇంగ్లీష్ మీడియంపై చర్చ  సందర్భంగా.. జగన్ సర్కార్ నిర్ణయాన్ని స్వాగతించారు. దీంతో ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా పవన్ కి మద్దతు ఇవ్వట్లేదంటూ విమర్శలు మొదలయ్యాయి.

ఇక తాజాగా రాపాక చేసిన కామెంట్స్ మరింత హాట్ టాపిక్ అయ్యాయి. పవన్ తాజాగా రైతుల కోసం దీక్ష చేసిన సంగతి తెలిసిందే. అయితే.. అసెంబ్లీ సమావేశాల కారణంగా పవన్ సభకు హాజరు కాలేదని గతంలో చెప్పిన రాపాక.. తాజాగా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ముందు మీడియాతో మాట్లాడుతూ.. ఇతర కారణాల వల్ల పవన్‌ సభకు వెళ్లలేదని చెప్పారు. అంతేకాదు, పవన్‌ ఏ కార్యక్రమం చేసినా.. పదిమంది మాత్రమే వస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్న చిన్న విషయానికి ధర్నాలు, సభలు పెట్టడం సరికాదని రాపాక సూచించారు. ముందుముందు పవన్‌ సభలకు ఇంకా ఆదరణ తగ్గిపోతుందని షాకింగ్ కామెంట్స్ చేసారు. మొత్తానికి రాపాక తీరు చూస్తుంటే జనసేనకి మరింత దూరం జరుగుతున్నారని అర్థమవుతోంది. వైసీపీలో చేరేందుకు ఆయన ఉత్సాహంగా ఉన్నారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. మరి రాపాక పార్టీ మారతారో లేక తన తీరుని మార్చుకుంటారో చూడాలి.