'నాయక్' గారింట్లో పెళ్లి... నాయకులందరికీ 'గులాబీ' డ్రస్సులు రెడీ!


పెళ్లి అంటే భారతీయుల్లో వుండే హడావిడే వేరు! మనకు పెళ్లి ఒక ఈవెంట్ కాదు... లైఫ్ టైం మెమరీ! అందుకే, పెళ్లి పెట్టుకుంటే ఆ ఇంట్లో జరిగే తతంగం మాటల్లో వర్ణించలేం. ఇది ఎవరి ఆర్దిక స్థోమతకి తగ్గట్టుగా వారికుంటుంది. ఎంత పేద వాడైనా తన రేంజ్లో తాను గాబరా పడిపోతుంటాడు.ఇక బాగా డబ్బున్న వాళ్లు, వీఐపీలు, సెలబ్రిటీలు అయితే చెప్పేదేముంది? తమ ఇంటి పెళ్లి జాతి చరిత్రలో నిలిచిపోవాలన్నంత కసితో ఏర్పాట్లలో మునిగిపోతారు!

 

ఈ మధ్య కాలంలో భారీ పెళ్లి హంగామా అంటే అందరికీ గుర్తొచ్చేది గాలి వారి పెళ్లే! వారింట్లో పెళ్లి ఈదురు గాలిలా చుట్టుముట్టేసింది! ఇప్పుడు మన తెలంగాణలో అటువంటిదే ఒక వీఐపీ వెడ్డింగ్ జరగబోతోంది. మరీ గాలి జనార్దన్ రెడ్డిలా ఆర్భాటానికి పోకున్నా... మన నేతగారు కూడా తన రేంజ్లో వివాహా ఏర్పాట్లతో అదరగొడుతున్నారు! ఇంతకీ... అసలు విషయం ఏంటంటే... టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్! ఆయన తన మూడో కుమారుడి షాదీ గ్రాండ్ గా చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే, పెళ్లి, పెళ్లి పందిరి, ముత్యాల తలంబ్రాలు, నోరూరించే భోజనాలు .... ఇవన్నీ ఎంత స్పెషల్ గా చేసినా అందరూ అన్ని పెళ్లిళ్లో ప్రదర్శిచే బడాయిలే! కాబట్టి ఇంకా సమ్ థింగ్ స్పెషల్ చేయాలనుకున్నారు నాయక్! వెంటనే తన అభిరుచినంతా ఆహ్వాన పత్రికల్లో ఇమిడ్చేశారు!

 

రాములు నాయక్ ఎమ్మెల్సీ కాబట్టి తన తోటి ఎమ్మెల్సీలందరికీ, అలాగే ఇతర ప్రజాప్రతినిధులకి ఖచ్చితంగా వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వాలి. అలా ఇచ్చేప్పుడు ఆయన పెళ్లికి రాబోయే సదరు గెస్ట్ ఏం వేసుకుని రావాలి? అదుగో... ఆ సంప్రదాయబద్ధమైన లాల్చీ, పైజామా పత్రికతో పాటూ ప్యాక్ చేసి ఇచ్చే ఏర్పాటు చేశారు! ఆ బట్టలు వేసుకునే గెస్ట్ లు అంతా పెళ్లికి రావాలన్నమాట! అయితే, ఇందులో మరో ట్విస్ట్ కూడా వుంది. టీఆర్ఎస్ పెమ్మెల్సీ అయిన రాములు నాయక్ తన కొడుకు పెళ్లికి వచ్చే వారందరికీ పింక్ లాల్చీ, పైజామాలు అందించారట! అంతే కాదు, తాను పెళ్లికి పిలవబోయే అతిథుల బాడీ కొలతలు ముందుగానే తీసుకుని మరీ ఈ పింక్ , లాల్చీ పైజామాలు కుట్టించారట! మొత్తానికి త్వరలో జరగబోయే పెళ్లిలో వచ్చిన వారంతా ఎమ్మెల్సీగారు అందించిన వెండి కడియాలు తొడుక్కుని... గులాబీ రంగు డ్రెస్సుల్లో కళకళలాడనున్నారన్నమాట!

 

రాములు నాయక్ ఆహ్వానం మేరకు మిగతా పార్టీల్లోని ఆయన మిత్రులు కూడా పింక్ యూనీఫారాలు ధరిస్తారా? ఈ ధర్మ సందేహం పెళ్లి రోజే తేలుతుంది! కాకపోతే, ఒక్కటి మాత్రం పెద్ద రిలీఫ్ కలిగించే అంశం! పెళ్లనగానే ఏం వేసుకోవాలా అని బుర్రలు బద్ధలు కొట్టుకునే వారికి ఇలా వెల్ కమ్ డ్రస్సులు కూడా ఇవ్వటం చాలా వరకూ సమస్య సాల్వ్ చేస్తుంది! ఏమంటారు?