రామాయణంతో భారతీయులు, హిందువులు కాని వారికేం పని? ఇది చదివితే తెలుస్తుంది!

మనం ప్రతీ యేటా శ్రీరామనవమి జరుపుకుంటాం! ఆచారం, సంప్రదాయం ప్రకారం కళ్యాణం జరిపించి వడపప్పు, పానకం ప్రసాదంగా స్వీకరించి పండగ అయిందనిపిస్తాం. కాని, శ్రీరాముడు , శ్రీమద్రామాయణం… అంత వరకే పరిమితమా? కానే కాదు! రాముడు, రామాయణం మన జాతి గతానికి అతి గొప్ప సంకేతాలు! మనకు లభించిన అమూల్యమైన వారసత్వాలు! రాముడు దేవుడు అనుకునే వారితో ఎలాంటి ఇబ్బందీ లేదు. కాని, రాముడ్ని ఒక కల్పిత పాత్రగానో, చారిత్రక పాత్రగానో భావిస్తే మాత్రం… ఆయన ప్రభావం మన అయోధ్య నగరం నుంచీ మొదలు పెట్టి సుదూర తీరాల వరకూ వ్యాపించింది. అది తెలుసుకుంటే మనకే ఆశ్చర్యంగా వుంటుంది!

 

రాముడు జన్మించాడని చెప్పే అయోధ్యా నగరం, కోసల రాజ్యం, సరయూ నదీ అన్నీ మన దేశంలోనే వున్నాయి. కాని, విచిత్రంగా మన భారతదేశంలో శ్రీరామ నవమి నేషనల్ హాలి డే కూడా కాదు! అయితే, చైనా, తైవాన్, రష్యా లాంటి దేశాల్లో కూడా రాముడు, రామాయణం ప్రభావం వుందని మీకు తెలుసా? అక్కడ సామాన్య ప్రజలు మొదలు పాలకుల వరకూ అందరూ ఇప్పటికీ రామ శబ్దానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు! ఈ అంశంలో కొన్ని ఆశ్చర్యకర సత్యాలు తెలుసుకుంటే ఆనందం కలగక మానదు!

 

చైనా దేశంలో మన దగ్గరిలాగే చాలా పౌరాణిక, జానపద గాథలు ప్రచారంలో వుంటాయి. వాటిల్లో చాలా ఫేమస్ గా కనిపించే పాత్ర సన్ వుకాంగ్! ఈయన మంకీ కింగ్! అంటే వానర రాజన్నమాట! ఈ విషయం చెప్పగానే మనకు అమాంతం గుర్తుకు వచ్చేది ఎవరు? రామదూత హనుమంతుడే కదా! ఆయనలాగే సన్ వుకాంగ్ కూడా అపారమైన బలవంతుడు. చిరంజీవి! ఈ పాత్ర సృష్టికి మూలం మన రామాయణంలోని ఆంజనేయుడే! ఆయన ప్రేరణగానే సన్ వుకాంగ్ పుట్టి ఎన్నో వందల చైనీస్ బౌద్ధ గాథల్లో కథానాయకుడిగా నిలిచాడు! ఇక రామాయణాన్ని చైనా దేశం ప్రజలు ఏమంటారో తెలుసా? లంకా జీ అంటారు!

 

రష్యాలో రామాయణ గాథని నాటకంగా ప్రదర్శించటం సర్వ సాధారణం! అక్కడి వారు హిందూ మతస్థులు కాకపోయినా రామాయణ గాథని ఎంతో అభిమానంగా ఆదరిస్తూ వుంటారు. జీ. పెచ్నికోవ్ అనే రష్యన్ నటుడు ఎన్నో సార్లు రంగస్థలంపై రాముడివేషం వేశాడు! అందుకుగానూ, మన ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం కూడా ఇచ్చింది!

 

రష్యానే కాదు… పక్కనున్న మంగోలియాలో కూడా రామాయణం చాలా ఫేమస్! అక్కడి కాల్మిక్స్ అనే జాతి వారి జానపద కథల్లో బోలెడు సార్లు మన శ్రీరాముడు కనిపిస్తాడు. వారు రాముడ్ని గొప్ప హీరోగా వర్ణించుకుంటారు!

 

భారతదేశాన్ని ఆనుకొని వున్న దేశాల్లో ఒకటి మయన్మార్. గతంలో దీన్ని బర్మా అనేవారు. అంటే, బ్రహ్మ దేవుడి భూమి అని అర్థం. ఇప్పుడు ఇక్కడ వున్నది బౌద్ధం. అయినా కూడా బర్మా వారి అనధికారిక జాతీయ ఇతిహాసం ఏంటో తెలుసా? యామా జట్డా! ఇది మరేదో కాదు. మన రామాయణమే! రామ అనే శబ్దాన్నే యామా అంటారు!

 

రామాయణాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తోన్న మరో ఆసియా దేశం కాంబోడియా. ఇక్కడ మన రామాయాణాన్ని రీమ్కర్ అంటారు. పెద్ద ఎత్తున నృత్య రూపకంగా ప్రదర్శించటం కాంబోడియా రామాయణ విశిష్టత! రామాయణం ప్రదర్శించే ప్రత్యేక నృత్యాన్ని కాంబోడియా జనం లకోన్ అంటారు!

 

ఇక థాయ్ లాండ్ విషయానికి వస్తే … ఇప్పటికీ థాయ్ రాజుల పేర్లు రామా అనే వుంటాయి! వాళ్లు పాటించేది బౌద్ధం అయినప్పటికీ తమకి తాము రామా అనే వ్యవహరించుకుంటారు. ఇప్పుడున్న థాయ్ రాజు పేరు రామా X. గతంలో కూడా వరుసగా అనేక రాముళ్లు థాయ్ సింహాసనాన్ని అదిష్ఠించారు. అసలు ఒకప్పుడు థాయ్ రాజ్యాన్ని అయోథియా అంటే… అయోధ్యా అనే అనేవారు!

 

భారతదేశం చుట్టు పక్కల వున్న రాజ్యాలే కాదు.. కొంచెం దూరంగా వున్న జపాన్, కొరియా లాంటి దేశాలపైన కూడా రామాయణ ప్రభావం వుంది. రాముడి ఆరాధన వుంది. ఉదాహరణకి కొరియానే తీసుకుంటే… అక్కడి వారు వేల ఏళ్ల క్రితం అయోధ్య నగర యువరాణే తమ రాజును పెళ్లి చేసుకుందని నమ్ముతారు! వారిద్దరి సంతానం నుంచే కొరియా రాజవంశం , నాగరికత మొదలయ్యాయి! అందుకే, మన అయోధ్యా నగరాన్ని ప్రతీ సంవత్సరం వేల మంది కొరియన్లు సందర్శిస్తుంటారు!

 

ప్రపంచంలోని ఎన్నో దేశాలు, సంస్కృతులు, నాగరికతలు రామాయణాన్ని , రాముడ్ని నెత్తిన పెట్టుకుంటుంటే మనం మాత్రం తగినంత శ్రద్ధ చూపుతున్నట్టు కనిపించటం లేదు. కొందరు రామ నామాన్ని రాజకీయంగా వాడితే మరికొందరు రామ శబ్దాన్ని మతోన్మాదానికి సంకేతంగా దుష్ప్రచారం చేస్తున్నారు. అలా కాకుండా రాజకీయాలకు అతీతంగా శ్రీమద్రామాయణాన్ని మనం ఘనమైన వారసత్వంగా కాపాడుకోవాలి.