మా బాబు మంచివాడని రమణ దీక్షితులు ఇందుకే అన్నారా?

తిరుమల వెంకన్న ప్రధానార్చకులుగా రమణ దీక్షితులు ఇప్పుడు అందరికీ తెలిసిన వారే! నిజానికి ఆయన అర్చకులుగా వున్నప్పటి కంటే పదవీ విరమణ తరువాతే మరింత ఫేమస్ అయ్యారు. కారణం వివాదాల పరంపరనే! టీటీడీలో అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించటం మొదలు పింక్ డైమండ్ అని ఒకసారి, అమిత్ షాను కలిసి ఒకసారి, జగన్ తో బేటీ అయ్యి ఒకసారి ఆయన వార్తల్లో నిలుస్తున్నారు. లోపలి కారణాలు అసలేంటో ఎవ్వరికీ తెలియదు. తప్పు టీటీడీదా? రమణ దీక్షితులుదేనా? అంతా అయోమయమే! కానీ, ఈ గొడవ మొత్తంలోకి చంద్రబాబు పేరు కూడా పదే పదే వచ్చేస్తోంది. ఆయన ప్రమేయం ఎంత మేర అన్నది కూడా అస్పష్టమే. రమణ దీక్షితులు లాంటి అర్చకులకి 65 ఏళ్ల వయో పరిమితితో బలవంతంగా రిటైర్మెంట్ ఇవ్వటం చంద్రబాబు ఆలోచనా? లేక టీటీడీ బోర్డులోని వారిదా? దాన్ని ముందుగానే సీఎంకి చెప్పి అమలు చేశారా? ఇలా బోలెడు ప్రశ్నలు! అయితే తాజాగా రమణ దీక్షితులు బాబుకి క్లీన్ చిట్ ఇవ్వటం నిజంగా ఆసక్తికరమే!

 

 

ఇంత కాలంగా పోరుబాట పట్టిన రమణ దీక్షితులు ఇప్పుడు రూటు మార్చారా? సుప్రీమ్ గడప తొక్కుతాననీ, న్యాయపోరాటం చేసి తన అర్చకత్వ పదవి తాను తిరిగి పొందుతానని చెప్పుకొచ్చిన ఆయన వున్నట్టుండీ చంద్రబాబు గురించి వ్యాఖ్యలు చేశారు. ఆయన తనకు శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీలో జూనియర్ అని గుర్తు చేసుకున్నారు. అంతే కాదు, చంద్రబాబు మంచివాడని కూడా కితాబునిచ్చారు. సీఎంగా ఆయన ఆంధ్రా ప్రజల అభివృద్ధి కోరతారని అన్నారు. ఇతరులెవరో చంద్రబాబుని పక్కదోవ పట్టించారని కూడా రమణ దీక్షితులు అనటం కొసమెరుపు! చంద్రబాబు తనకు అపాయింట్ మెంట్ ఇచ్చి కూడా క్యాన్సిల్ చేశారని వాపోయారు!

 

 

ఈ తాజా కామెంట్స్ తో రమణ దీక్షితులు చెప్పదలుచుకున్నది ఏంటి? తనకు సీఎంతో సంధి ఓకేనని చెబుతున్నారా? అలాగే, తనకు అప్పాయింట్ మెంట్ ఇస్తే బాబుని కలిసి ఆయన ఏమైనా చెప్పదలుచుకున్నారా? బాబు మంచివాడే కానీ… అంటూ ముక్తాయింపు ఇచ్చారంటే… ఆ అసలు విలన్లు ఎవరు? బోలెడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి దీక్షితులు మాటలతో! ఏది ఏమైనా స్వరం మార్చిన రమణ దీక్షితులు తత్వం గ్రహించారనే భావించాలి. దిల్లీలో మకాం వేసి న్యాయ పోరాటం చేయటం అంత సులువేం కాదని అర్థమై వుండవచ్చు. టీటీడీ తీసుకున్న నిర్ణయం కోర్టు కొట్టివేస్తుందో లేదో చెప్పలేని పరిస్థితి. అలాగే కేసులో ఆయన విజయం సాధించినా అది ఎన్నాళ్లు సాగుతుందో ఊహించలేని వ్యవహారం. వీటన్నటి మధ్యా సమరం కంటే సంధే మంచిదని భావించారనుకోవాలి!

మహాసంప్రోక్షణ సందర్భంగా తొమ్మది రోజులు భక్తుల్ని రానివ్వమని ప్రకటించిన టీటీడీ పెద్ద దుమారం రేపింది. అయితే, దాన్ని చంద్రబాబు ఒక్క ఆదేశంతో సద్దుమణిగించారు. భక్తుల్ని పరిమిత సంఖ్యలో అనుమతించాల్సిందేనని తెలిపారు. రమణ దీక్షితులు వ్యవహారం కూడా సీఎం అలాగే డీల్ చేస్తే సరిపోతుందని అంటున్నారు విశ్లేషకులు. ఆయనకి అప్పాయింట్ మెంట్ ఇచ్చి అతడి వాదన కూడా వింటే సమస్య చాలా వరకూ సద్దుమణగవచ్చు. ఎన్నికలు అంతకంతకూ సమీపిస్తున్న తరుణంలో ఒకవేళ దీక్షితులు సుప్రీమ్ గడప తొక్కిదే టీడీపీకి ఎంతో కొంత ఇబ్బందికరమే. దీన్ని దృష్టిలో పెట్టుకున్నా కూడా చంద్రబాబు చర్చకు ఆస్కారం కల్పించి రమణ దీక్షితులు వివాదాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తే ఎంతో బావుంటుంది.