శ్రీవారి గుప్త నిధులకు దారి చెప్తున్న రమణదీక్షితులు

 

వెంకటేశ్వర స్వామి.. కలియుగ దైవం.. 'మేం చేసిన పాపాలకు మన్నించు, మా చుట్టూ ఉన్న పాపాత్ముల నుండి రక్షించు' అని అని వేడుకుంటాం.. కానీ పాపం ఈ మధ్య ఆ వెంకన్నకు కూడా కష్టాలు వస్తున్నాయి.. ఆయన చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి..  మనుషులకి కష్టం వస్తే దేవుడికి మొరపెట్టుకుంటాం.. మరి దేవుడికే కష్టం వస్తే, మనుషులం మాట్లాడుకోవడం తప్ప ఏం చేయగలం.. గత కొన్నిరోజులగా ఏపీ రాజకీయాల్లో వెంకన్న పేరు బాగా వినిపిస్తుంది.. దానికి కారణం టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు.. వయస్సు పరిమితి నిబంధనతో ఏపీ ప్రభుత్వం, రమణ దీక్షితులుని పదవి నుండి తొలగించింది.. 


అప్పటినుండి ఇక దీక్షితులు ప్రభుత్వం మీద విమర్శలు చేయడం మొదలు పెట్టారు.. శ్రీవారి సన్నిధిలోని విలువైన ఆభరణాలు తీసుకున్నారని ప్రభుత్వం మీద, అక్రమాలు చేస్తున్నారని పాలకమండలి మీద ఆరోపణలు చేసారు.. అయితే రమణదీక్షితులు వెనక విపక్షాలు ఉండి ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నాయని ప్రభుత్వం కూడా ధీటుగా ఆరోపణలు చేసింది.. ఇప్పడు రమణ దీక్షితులు శ్రీవారి గుప్త నిధుల రహస్యాల గురించి చెప్పారు.. అంతేకాదు ఆ గుప్త నిధులకోసం తవ్వకాలు జరిగాయని కూడా ఆరోపించారు.. ఇంతకీ దీక్షితులు ఏమన్నారంటే.. మూడవ మహారాజు విజయనగర సామ్రాజ్యాధిపతి తిరుమలరాయల వారు, కాకతీయ మహారాజు ప్రతాపరుద్రుడు ఇలాంటి రాజులు అప్పట్లో శ్రీవారికి రత్నాలు, బంగారు ఆభరణాలు, విగ్రహాలు ఇలా చాలా సంపద సమర్పించారు.. 

 

ఆ సంపదంతా నేల మాళిగలో భద్రపరిచారు.. ఆ నేల మాళిగ వంటశాల దగ్గర్లో ఉంది.. గతేడాది స్వామి వారి లోపలి పోటును మూసేసారు.. ఎందుకు ముసారని అడిగితే,  నాలుగు రాతి బండలు పగిలాయని కొద్ది రోజులు పోటు మూసివేశామని జేఈఓ చెప్పారు.. కానీ ప్రధాన అర్చకులకు కూడా చెప్పకుండా పోటు ఎందుకు మూయటం జరిగింది.. గుప్త  నిధుల కోసం తవ్వకాలు జరిపి ఉండొచ్చు.. నా ఆరోపణలకు స్పందించాలి అని రమణ దీక్షితులు అన్నారు.. అంతా బాగానే ఉంది గాని ఇలా స్వామి వారి గుప్త నిధుల ఉన్న ప్రదేశం గురించి బయటపెట్టడం ఎంత వరకు సబబు దీక్షితులు గారు.. ఆ నిధులకి ఇప్పుడు రక్షణ కల్పించడం ఇంకా కష్టమవుతుంది అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.. ఏంటో ఇదంతా, ఆ వెంకన్నకే తెలియాలి.