సోము వీర్రాజు స్పీడ్ కి బ్రేకులు.. హైకమాండ్ మనసులో ఏముంది?

ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. సోము వీర్రాజుకుకు అమరావతి అంశంపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి షాకిచ్చారు. రాష్ట్రానికి ఒక్క రాజధాని ఉండటమే మంచిదన్నారు. ఇటీవల ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో  మాట్లాడిన సోము వీర్రాజు.. 13 జిల్లాలున్న రాష్ట్రానికి 13 రాజధానులు ఉంటే తప్పేంటన్నారు. మూడు రాజధానులకు మద్దతిస్తున్నట్లుగా తన వాయిస్ చెప్పారు. అయితే, ఏపీ బీజేపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు ప్రమాణ స్వీకారోత్సవంలో మాట్లాడిన రాం మాధవ్ మాత్రం.. మూడు రాజధానులను పూర్తిగా  వ్యతిరేకించారు. దేశంలో ఏ రాష్ట్రానికి మూడు రాజధానులు లేవన్నారు. దేశంలో పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కు లక్నో ఒక్కటే క్యాపిటల్ గా ఉందన్నారు. ఒక్క రాజధాని ఉన్న యూపీలో సరైన పాలన జరగడం లేదా అని ప్రశ్నించారు. సోము వీర్రాజు సమక్షంలోనే అమరావతిపై రాంమాధవ్ క్లారిటీ ఇవ్వడంతో ఆయన షాకయ్యారు.

 

ఏపీ సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రకటనను రాష్ట్ర బీజేపీ గతంలో వ్యతిరేకించింది. అప్పటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అమరావతికి మద్దతుగా నిలిచారు. కన్నాతో పాటు మరి కొందరు నేతలు అమరావతి కోసం గళం వినిపించారు. అయితే సోము వీర్రాజు మాత్రం  పాలనా వికేంద్రీకరణతో ప్రజలకు‌ మంచి జరుగుతుందన్నారు. అమరావతి రైతులకు న్యాయం జరగాలంటూనే చంద్రబాబు పాలనపై విమర్శలు చేశారు. అమరావతిలో అవినీతి జరిగిందని ఆరోపించారు. అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని టీడీపీ కోరగా.. కేంద్రానికి సంబంధం లేదంటూ బాబుకు కౌంటర్లు ఇచ్చారు వీర్రాజు.
      

ఇక సీఆర్డీయే రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులను గవర్నర్ ఆమోదించడం, అమరావతికి మద్దతుగా నిలిచిన కన్నాను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడం, చంద్రబాబుకు వ్యతిరేకమనే అభిప్రాయం ఉన్న సోము వీర్రాజుకు పార్టీ పగ్గాలు ఇవ్వడంతో.. అమరావతి విషయంలో జగన్ సర్కార్ నిర్ణయానికి కేంద్రం అనుకూలమనే భావన కలిగింది. రాజధాని అంశంపై హైకోర్టులో జరుగుతున్న విచారణలో.. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోని విషయమని కేంద్రం అఫడవిట్ ఇవ్వడంతో అది మరింత బలపడింది. దానికితోడు అమరావతికి మద్దతుగా మాట్లాడిన నేతలను కూడా రాష్ట్ర బీజేపీ సస్పెండ్ చేసింది.

 

అమరావతికి మద్దతుగా మాట్లాడారని సీనియర్ నేత వెలగపూడి గోపాలకృష్ణను సస్పెండ్ చేయడంతో పార్టీలో సోము వీర్రాజుకు తిరుగులేదు అనుకున్నారు అంతా. కానీ గంటల్లోనే సీన్ మారిపోయింది. సోము వీర్రాజుకు హైకమాండ్ ఝలక్ ఇచ్చింది. వెలగపూడి గోపాలకృష్ణకి హిందూ మహాసభ ఏపీ అధ్యక్ష పదవి కట్టబెట్టింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కొన్ని నిమిషాల్లోనే వెలగపూడికి కీలక పోస్ట్ దక్కడం, అది కూడా బీజేపీ పెద్దల డైరెక్షన్ లోనే జరగడంతో సోము వీర్రాజు వర్గం షాకైంది. సస్పెండైన వెలగపూడికి హిందూ ఆర్గనైజేషన్ లో కీలక పదవి ఇవ్వడం సోము వీర్రాజుకు ఇబ్బందికరమేనని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

 

ఇక, సోము వీర్రాజు ప్రమాణ స్వీకార వేదిక పైనే అమరావతిపై రాంమాధవ్ చేసిన కామెంట్స్ ఏపీ బీజేపీలో సంచలనంగా మారాయి. ఆయన వ్యాఖ్యలతో అమరావతిపై బీజేపీ పెద్దలు సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోదని కేంద్రం చెబుతున్నా.. పార్టీ పరంగా మాత్రం బీజేపీ అమరావతికే కట్టుబడిందనే విషయం అర్థమవుతోంది. ముఖ్యంగా అమరావతికి‌ భూములిచ్చిన‌ చివరి  రైతుకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని రాంమాధవ్ చెప్పడంతో.. రాజధాని విషయంలో బీజేపీ ఏం చేయబోతుందన్నది ఆసక్తిగా మారింది. మొత్తానికి సోము వీర్రాజు ఒకలా ఆలోచిస్తే, పార్టీ పెద్దలు మరోలా ఆలోచిస్తున్నారు అనిపిస్తోంది. దీనిని బట్టి చూస్తుంటే, ముందు ముందు సోము వీర్రాజు పయనం అంత ఈజీగా ఉండదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.