ఎన్టీఆర్ ఆత్మ కలలోకి వస్తుంది.. స్టోరీ చెబుతుంది..!


రామ్ గోపాల్ వర్మ తీస్తున్న "లక్ష్మీస్ ఎన్టీఆర్" సినిమాపై వివాదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. వర్మ ఇంకా సినిమా ప్రారంభించకముందే సినిమాపై పలు వివాదాలు వచ్చాయి.. వస్తున్నాయి కూడా. తాము దైవంగా భావించే ఎన్టీఆర్ గురించి తప్పుగా చూపిస్తే ఊరుకునేది లేదని టీడీపీ నేతలు ఇప్పటికే వర్మకు వార్నింగ్ ల మీద వార్నింగ్ లు ఇస్తున్నారు. మరి ఆ వార్నింగ్ లకు వర్మ భయపడే రకమా..? తాను కూడా రివర్స్ లో కౌంటర్లు ఇచ్చాడు. నేను అలా తీస్తానని చెప్పి వాళ్ల చెవిలో ఏమన్న చెప్పానా అని రివర్స్ పంచ్ ఇచ్చాడు. ఇక ఇలా మాటల యుద్దం జరుగుతున్న నేపథ్యంలోనే వర్మ  'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా స్ర్కిప్ట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను తలపెట్టిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా స్క్రిప్ట్ విషయంలో దివంగత మహానుభావుడు నందమూరి తారక రామారావు స్వయంగా గైడ్ చేస్తున్నారని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించాడు. తన ట్విట్టర్లో.. ప్రతి రోజూ ఎన్టీఆర్ ఆత్మ తన కలలోకి వస్తోందని, స్క్రిప్ట్ విషయంలో సహకరిస్తున్నారని.. ఆయన ఆత్మ తనతో మాట్లాడుతోందని, సినిమా ఎలా ఉండాలన్న విషయమై సలహాలు, సూచనలు ఇస్తోందని చెప్పాడు. మరి ఇప్పటికే వర్మకి, టీడీపీ నేతలకు.. ఎన్టీఆర్ అభిమానులకు మధ్య మాటల యుద్దం నడుస్తుండగా.. దీనిపై ఎంత దుమారం రేగుతుందో చూద్దాం.