చెల్లెలు పక్కన ఉంటే ఆ లైఫే వేరబ్బా..

 

రాఖీ పండుగ వచ్చిందంటే... మన దేశంలో తెగ సందడి కనిపిస్తుంది. చిట్టి చెల్లెళ్లు, తల్లిలాంటి అక్కయ్యలు కట్టే రాఖీ కోసం అంతా ఎదురుచూస్తుంటారు. ఇంతకీ ఇంట్లో ఒక సోదరి ఉంటే ఆ విలువే వేరనుకోండి. కానీ ఆ విలువకి రుజువు ఏమన్నా ఉందేమో అని తెలుసుకోవాలనుకున్నారు పరిశోధకులు. మరి ఆ పరిశోధన ఏమిటో, అందులో ఏమని బయటపడిందో మీరే చూడండి!

 

మన జీవితంలో 10 నుంచి 14 ఏళ్లలోపు వయసు చాలా కీలకం అంటూ ఉంటారు. బాల్య దశ నుంచి టీనేజిలోకి అడుగుపెట్టే ఆ క్రమంలో మన వ్యక్తిత్వం ఎంతో మార్పుకి లోనవుతుంది. ఇలాంటి సమయంలో ప్రతి చిన్న విషయమూ మన మనసుని ఎంతో ప్రభావితం చేస్తుంది. ఒంటరితనానికి లోనుకావడం, భయందోళనలకు గురికావడం, ఆత్మన్యూనతకి లోనుకావడం, లేనిపోని గొడవల్లో తలదూర్చడం.... లాంటి సమస్యలు ఈ వయసు కుర్రకారుని వేధిస్తాయి. ఇలాంటి సమయంలో ఇంట్లో అక్కాచెల్లెళ్లు ఉంటే ఆ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్నారు పరిశోధకులు.

 

తాము ఎంచుకున్న విషయాన్ని పరిశోధించేందుకు 10-14 ఏళ్లలోపు పిల్లలు ఉన్న ఓ 395 కుటుంబాలను ఎంచుకొన్నారు. సదరు పిల్లల మానసిక స్థితి ఎలా ఉంది? వాళ్ల జీవనశైలి ఎలా ఉంది? వాళ్లకి అక్కయ్యలు కానీ చెల్లెళ్లు కానీ ఉన్నారా? లాంటి సవాలక్ష విషయాలన్నింటినీ సేకరించారు. ఓ ఏడాది గడిచిన తర్వాత ఇదే పిల్లలని మరోమారు పరిశీలించి చూశారు.

 

ఆశ్చర్యకరంగా ఇంట్లో అక్కయ్యకానీ, చెల్లెలు కానీ ఉన్న కుర్రకారు చాలా సంతోషంగా కనిపించారట. ఎలాంటి అడ్డంకులనైనా ఎదుర్కొంటూ, ఎలాంటి ఆందోళననైనా అధిగమిస్తూ ఉన్నారట. ఇంట్లో ఒక అక్కో చెల్లో ఉంటే చాలు! వాళ్లు బాగా చిన్నవారైనా, పెద్దవారైనా కూడా ఇంట్లోని మగపిల్లవాడి మీద వాళ్ల సానుకూల ప్రభావం ఉన్నట్లు తేలింది.

 

ఇంట్లో అక్కో, చెల్లో ఉంటే మనసు సంతోషంగా ఉండటమే కాదు... వ్యక్తిత్వం కూడా దృఢంగా ఉంటుందని తేలింది. తోటివారికి సాయపడాలని అనుకోవడం, బడిలో పిల్లలతో మంచిగా మెలగడం, మంచి పనులు చేయడంలో ముందు ఉండటం... లాంటి స్వభావాలు అక్కా లేదా చెల్లి ఉన్న పిల్లలలో కనిపించాయట. ఒక్క మాటలో చెప్పాలంటే తల్లిదండ్రుల ప్రభావం కంటే సోదరీమణుల ప్రభావమే ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

 

అయితే ఇంట్లో కేవలం అక్కా లేదా చెల్లి ఉంటే సరిపోదు, వాళ్లతో సఖ్యత కూడా ఉండాలి కదా! అన్న అనుమానం రావచ్చు. నిజమే! అలా ఇంట్లో అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల మధ్య సఖ్యత ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఒకవేళ వారిద్దరూ భిన్నధృవాలలాగా ఉన్నా, కనీసం వారి మధ్య మాటామంతీ ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. ఎందుకంటే మొహమొహాలు చూసుకోని బంధాలకంటే చిన్నాచితకా కొట్లాటలతో సాగే బాంధవ్యమే మున్ముందు నిలిచే అవకాశం ఉందట.

 

- నిర్జర.