రాజకీయాల్లో కూడా సక్సెస్ అవుతా..

 

సూపర్ స్టార్ రజనీకాంత్‍‌.. ఈయన గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సాధారణ బస్ కండక్టర్ స్థాయి నుండి సూపర్ స్టార్‌గా ఎదిగిన ఆయన జీవితం ఎందరికో ఆదర్శనం. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇంత పెద్ద స్టార్ అయ్యారు. సౌత్‌లో ఈయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంక ఏహీరోకి ఉండరని చెప్పడం అతిశయోక్తి కాదేమో. ఇక తమిళనాడులో అయితే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..ఈయన్ని ఆయన అభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు. అంత పెద్ద సూపర్ స్టార్ అయి ఉండి కూడా ఎలాంటి ఆడంభరాలకు పోకుండా సాధారణ జీవితం గడిపేస్తుంటారు రజనీ. అప్పుడప్పుడు హిమాలయాలకు కూడా వెళ్లి ఆధ్యాత్మిక జీవితంలో మునిగిపోతారు.

 

ఇక తన సినీ జీవితంలో సక్సెస్ అయిన రజనీ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఎప్పటినుండో రజనీ రాజకీయ ప్రస్థానంపై ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ ఆయన మాత్రం ఇటీవలే రాజకీయ ప్రవేశం చేశారు. అయితే పార్టీ పేరు..చిహ్నం ఇంకా ప్రకటించలేదు. అయితే ఇటీవల ఆధ్మాత్మిక పర్యటన నిమిత్తం హిమాలయాలకు వెళ్లిన రజనీ ఆసక్తికర రాజకీయాలపై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  రిషికేష్ లోని ధ్యానానంద సరస్వతి ఆశ్రమంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన..  నా అంతరాత్మ గురించి తెలుసుకునేందుకే నేను ఆధ్యాత్మిక బాట పట్టాను. మనిషి జీవిత లక్ష్యం తనను తాను తెలుసుకోవడమేనన్నారు. తాను ఆ ప్రయత్నంలోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. ఇంక తన రాజకీయ ప్రవేశంపై అడుగగా... తానింకా పూర్తి స్థాయి రాజకీయవేత్తను కాలేదని.. కనీసం రాజకీయ పార్టీ పేరును కూడా ప్రకటించలేదని... అయినా ఆశ్రమంలో రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. కానీ... రాజకీయ నాయకుడిగా సరికొత్త పాత్రను పోషించనున్న తాను, ఈ రంగంలోనూ విజయం సాధించగలనని నమ్ముతున్నట్టు చెప్పారు.  ప్రజలు తనపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, త్యాగాలు చేయడం ద్వారా వారి కోరికలను నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మొత్తానికి రజనీకాంత్ కు తాను ఈ రాజకీయ రంగంలో కూడా సక్సెస్ అవుతాననే నమ్మకం ఉంది. మరి మనం కూడా రజనీ రాజకీయాల్లో సక్సెస్ అవ్వాలని కోరుకుందాం..