భాషా భాషలో మార్పు వస్తోంది! రాజకీయ పదాలు పెరిగిపోతున్నాయ్!

 

రజినీకాంత్ స్వరం క్రమంగా మారుతోంది! రాజకీయాలు వద్దే వద్దన్నట్టు మాట్లాడే ఆయన అభిమానుల సమక్షంలో మెల్లగా గొంతు సవరించుకుంటున్నట్టు సూచనలు కనిపిస్తున్నాయి. అభిమానులతో సెల్ఫీల కోసం తొమ్మిదేళ్ల తరువాత సమావేశం అయిన ఆయన రోజకో కామెంట్ తో జనం దృష్టినీ, మీడియా చెవుల్నీ ఆకర్షిస్తున్నాడు. మొదట దేవుడు శాసిస్తే ఏదైనా చేస్తానన్న ఆయన తరువాత బీజేపి రాజకీయాల్లోకి రమ్మంటోంది కదా అంటే… దాన్ని తిరస్కరించలేదు. నేను చెప్పాల్సింది చెప్పేశాను. ఇంక చెప్పేదేం లేదు అన్నారు. కాని,ఎక్కడా బీజేపిలో చేరే ఉద్దేశం లేదు అని కానీ, రాజకీయాల్లోకి రాను అని కానీ రజినీ కుండ బద్దలు కొట్టలేదు.ఇక ఫైనల్ గా ఇప్పుడు ఆయన… యుద్ధం వస్తే రణ రంగంలోకి దిగుదామని అభిమానుల్ని మానసికంగా సిద్ధం చేసే కామెంట్ చేయనే చేసేశారు!

 

ఇప్పటి వరకూ రజినీకాంత్ ఎన్నో సార్లు తన రాజకీయ రంగ ప్రవేశం గురించి మాట్లాడారు. కాని, ప్రతీసారీ పాము చావదు, కర్ర విరుగదు అన్నట్టే సాగింది ఆయన టోన్. కాని, తాజాగా ఆయన చేసిన కామెంట్స్ రజినీ పొలిటికల్ ఎంట్రీ ఆల్మోస్ట్ కన్ ఫర్మ్ అన్నట్టుగా వున్నాయి. ఒకవైపు స్టాలిన్ మంచి నేత అంటూ పొగడ్తలు కురిపిస్తూనే రాజకీయాలు భ్రష్టుపట్టాయని విమర్శించాడు తలైవా. అందుకే అవసరం అయినప్పుడు యుద్ధం చేద్దామన్నాడు అభిమానులతో! ఇది ఖచ్చితంగా పొలిటికల్ ఎంట్రీకి సంకేతమే తప్ప మరొకటి కాదంటున్నారు విశ్లేషకులు. రజినీ అభిమానులు కూడా అదే మోడ్ లోకి, మూడ్ లోకి వెళ్లిపోయారట!

 

రానున్న పార్లమెంట్ ఎన్నికల నాటికి ఏదో ఒక పెద్ద నిర్ణయం తీసుకోనున్న రజినీకాంత్ అందుకు తగ్గట్టే కామెంట్ల పరంపర కొనసాగించారు ఫ్యాన్స్ ముందు. తాను కర్ణాటక కంటే ఎక్కువ ఏళ్లు తమిళనాడులో బ్రితికాననీ, బ్రతుకుతున్నానీ చెప్పిన ఆయన తాను వంద శాతం తమిళుడ్నేనని చెప్పుకొచ్చారు. ఈ స్టేట్మెంట్ జనానికి మరింత దగ్గరవ్వటానికే తప్ప ఊరికే యథాలాపంగా చేసింది కాదని ఎవరైనా చెప్పగలరు!

 

జయలలిత మరణం, కరుణానిధి విరమణంతో స్థబ్దంగా మారిన తమిళ రాజకీయాలు రజినీ ఎంట్రీతో రక్తి కడతాయని అంతా ఎదురు చూస్తున్నారు. మరి పడయప్ప ఈ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కాకుండా డైరెక్ట్ అనౌన్స్ మెంట్ ఎప్పుడో చేస్తారో వేచి చూడాలి…