అల్లు అర్జున్ ఈజ్ రియల్ లైఫ్ హీరో: రాజమౌళి

 

బాహుబలి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని అమాంతం హాలీవుడ్ స్థాయికి చేర్చిన దర్శకుడు రాజమౌళి రుద్రమదేవి సినిమాపై తన ట్వీటర్ ద్వారా ప్రశంశల వర్షం కురిపించారు. ముఖ్యంగా అందులో ముఖ్యపాత్రలు చేసిన అల్లు అర్జున్, రానా, అనుష్క, ప్రకాష్ రాజ్ లను చాలా మెచ్చుకొన్నారు. గోన గన్నారెడ్డి పాత్ర పోషించిన అల్లు అర్జున్ గురించి ఈవిధంగా అన్నారు. “రుద్రమదేవి సినిమా షూటింగ్ దాదాపు నిలిచిపోయినప్పుడు అల్లు అర్జున్ ప్రవేశించి దానిని ముందుకు తీసుకుపోవడమే కాకుండా గన్నా రెడ్డి పాత్రను చాలా అద్భుతంగా పోషించారు. ఆయన నటన సినిమాకే హైలైట్ అని చెప్పవచ్చును. మళ్ళీ ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా దానికి తెలంగాణా ప్రభుత్వం చేత వినోదపన్ను మినహాయింపు ఇప్పించడంలో సహాయపడినట్లు విన్నాను. అల్లు అర్జున్ సినిమాలోనే కాదు నిజజీవితంలో కూడా హీరో అనిపించుకొన్నాడు. అతనికి నా మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను.

 

రుద్రమదేవి పాత్రలో స్వీటీ (అనుష్క) అత్యద్భుతంగా నటించింది. ఆ పాత్రలో ఆమె కనబరిచిన నిబద్దత అత్యద్భుతం. రుద్రమదేవి పాత్రని ఆమె తప్ప మరొకరు చేయలేరనే అంత గొప్పగా నటించింది. అటువంటి గొప్ప నటిని కలిగి ఉండటం మన సినీ పరిశ్రమ అదృష్టం. రుద్రమదేవి, వీరభద్రుల పాత్రలు మరికొంత కొనసాగించి ఉండి ఉంటే చాలా తృప్తిగా ఉండేది. కానీ ఆ కొద్దిపాటి సమయంలోనే రానా తన ప్రతిభను చాటుకొన్నారు. ఇకపై ఎవరయినా ఇటువంటి చారిత్రిక సినిమాలను తీయదలిస్తే రానాయే మొదట గుర్తుకు వస్తాడు. అంత గొప్పగా చేసాడు రుద్రమదేవిలో తన పాత్రని. శివదేవయ్య రాజకీయ ఎత్తుగడలను కూడా మరికొంత చూపించి ఉండి ఉంటే బాగుండేది. ప్రకాష్ రాజ్ గారు తనకు ఇచ్చిన సమయంలో ఆ పాత్రలో అద్భుతంగా నటించారు. ఇటువంటి గొప్ప సినిమాను తీయలనుకొన్నందుకు, తీసినందుకు, తీసి విజయం సాధించినందుకు దర్శకుడు గుణశేఖర్ గారికి, వారి యూనిట్ మెంబర్లు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు,” అని రాజమౌళి ట్వీట్ చేసారు.