మోదీ విషయంలో చేసిన తప్పే కేసీఆర్ తోనూ చేస్తున్న రాహుల్!

రారాజు అయిన తరువాత కాంగ్రెస్ యువరాజు పూర్తి స్థాయిలో తెలంగాణకు వచ్చారు! సోనియా గాంధీ పట్టుదలతో రాష్ట్ర విభజన చేసిన తరువాత హస్తం గతి రెంటికీ చెడిన రేవడి అయింది. ఏపీలో సున్నా సీట్లు రాగా … తెలంగాణలో అధికారం సున్నా అయ్యి కూర్చుంది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష హోదాతో గత నాలుగేళ్లుగా సరిపెట్టుకుంటూ వస్తోంది రాహుల్ పార్టీ! ఇప్పుడు ఆయన హైద్రాబాద్ లో దిగి రెండు రోజుల పాటూ ఇక్కడే మకాం వేశారు. అందుక్కారణం పెద్దగా ఆలోచించాల్సినదేం కాదు. కేసీఆర్ మోదీతో వరుస భేటీలు జరుపుతూ ఏ క్షణాన్నైనా అసెంబ్లీ రద్దు చేసే ఆలోచనలో వున్నారు. అది పసిగట్టిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ రంగంలోకి దిగారు. తెలంగాణ కాంగ్రెస్ క్యాడర్ ను ఎన్నికలకు సమాయత్తం చేస్తూ తాము విభజించిన తెలుగు రాష్ట్రాల్లో కనీసం ఒక్క దాంట్లోనైనా అధికారం సాధించాలని తాపత్రయపడుతున్నారు. కానీ, అది ఎంత వరకూ సాద్యం?

 

 

ఎవరో కేసీఆర్ హార్డ్ కోర్ అభిమానులు లేదా కాంగ్రెస్ బద్ధ వ్యతిరేకులు చెప్పే మాటలు కాదు… నిజంగా కూడా తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకోవటం అంత సులువు కాదు! రాజకీయాల్లో అపర చాణుక్యుడైన గులాబీ బాస్ గత నాలుగేళ్లలో వీలైనంత జనాకర్షణ చేశారు. పాలన మొదలు పెట్టగానే ఆయన చేసిన సకల జనుల సర్వే మొదలు నిన్న మొన్నటి రైతు బంధు వరకూ అన్నీ ఓటర్లలో కోలాహలం సృష్టించాయి. వాటి వల్ల నిజంగా క్షేత్రస్థాయిలో జనానికి మేలు జరిగిందా అంటే ఎవరి వాదనలు వారికుంటాయి. కాకపోతే, ప్రత్యేక తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ మాత్రం మరీ దారుణమైన పాలన చేయలేదు. అలాగని అద్భుతాలు కూడా సృష్టించలేదు!

 

 

ఒకవైపు కేసీఆర్ పాలనలో కొన్ని లోపాలున్నా టీ కాంగ్రెస్ లో వాట్ని ఎత్తి చూపి ముందుకు దూసుకుపోయిన వారెవరు? నాలుగేళ్లుగా ఎవ్వరూ లేరనే చెప్పాలి! మొన్నటికి మొన్న మాజీ మంత్రి దానం నాగేందర్ పార్టీ మారటం వరకూ టీ కాంగ్రెస్ కు షాకుల మీద షాకులు ఇస్తూనే వస్తున్నారు కేసీఆర్. కానీ, ఆ రేంజ్లో తెలంగాణ కాంగ్రెస్ టీఆర్ఎస్ ని ఢీకొట్టింది లేదు. రేవంత్ రెడ్డి, నాగం లాంటి కొత్త నేతలు చేరినా, ఉత్తమ్ కుమార్, జానా లాంటి పాత నేతలు సిద్ధంగా వున్నా జనం పక్షాన జరిగిన భారీ ఉద్యమాలంటూ ఏమీ లేవు! పైగా కోమటిరెడ్డి బ్రదర్స్ లాంటి వారి కారణంగా అంతర్గత కుమ్ములాటలు యథప్రకారం సాగిపోతున్నాయి. వీటన్నటి మధ్యా హైద్రాబాద్ లో దిగిన రాహుల్ … తనకు కంప్లైంట్లు ఇవ్వద్దంటూ చెప్పేశారట! అందరూ కలిసి పని చేయండి. అధికారం సాధిద్దాం. తరువాత ఆలోచిద్దాం అన్నారట! ఈ మాటలతో కాంగ్రెస్ మార్కు అంతర్గత రాజకీయాలు చల్లబడిపోతాయి. అందరూ ఏకమైపోతారా? కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు… ఈ నలుగురితో కూడుకున్న గులాబీ దళాన్ని ఎదుర్కుని ఓడిస్తారా? డౌటే!

 

 

రాహుల్ పర్యటన సందర్భంగా మీడియాలో హడావిడి జరగవచ్చు. ఆయన దిల్లీ వెళ్లిపోతే మళ్లీ అంతా చల్లబడిపోతుంది. కానీ, కేసీఆర్ ఇక్కడే వుంటారు. ఆయనకు తెలంగాణ తప్ప మరో ప్రాంతంపై గురి లేదు. ఆయన స్వయంగా చెప్పినట్టు రాహుల్ కుటుంబానికి దేశం మొత్తం గోల కావాలి. కానీ, కేసీఆర్ ఫ్యామిలి దృష్టి మొత్తం తెలంగాణపైనే! కుటుంబ పార్టీనే అయినా టీఆర్ఎస్ తెలంగాణ జనానికి ఎక్కువ దగ్గరగా వుందన్నది నిజం. మరి తెలంగాణ కాంగ్రెస్ నేతల పరిస్థితి? ఏం చేయాలన్నా దిల్లీ నుంచీ ఆదేశాలు రావాలి! ఇది కేవలం తెలంగాణ కాంగ్రెస్ ఇబ్బందే కాదు. తెలంగాణ బీజేపీ కూడా అమిత్ షా వచ్చిపోయిన రెండ్రోజులు హడావిడి చేస్తుంది. తరువాత అంతా గప్ చుప్! ఇదే కేసీఆర్ లాంటి ప్రాంతీయ నేతలకి కలిసొచ్చే విషయం! వాళ్ల కాన్సన్ట్రేషన్ పూర్తిగా వారి రాష్ట్రంపైనే! జాతీయ పార్టీలు అలా చేయలేవు. జాతీయ పార్టీల స్థానిక నాయకత్వానికి పూర్తి స్వేఛ్ఛ వుండదు! మరీ ముఖ్యంగా, గాంధీలకు విధేయులైన కాంగ్రెస్ నేతల్లో అస్సలు వుండదు!

 

 

ఇక రాహుల్ తెలంగాణలో అస్సలు గుర్తించని సమస్య మరొకటి వుంది. ఎక్కడైనా ప్రతిపక్షాలు విడివిడిగా పోటీ చేస్తే అధికార పక్షానికి లాభం. ఎందుకంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుంది కాబట్టి! తెలంగాణలో కూడా అదే జరగటం దాదాపు ఖాయం అయిపోయింది. సెప్టెంబర్ లో అసెంబ్లీ రద్దు నవంబర్, డిసెంబర్లలో ఎన్నికలు అన్న సంకేతాలు కేసీఆర్ ఇచ్చేసినప్పటికీ రాహుల్ పొత్తుల కోసం ప్రయత్రాలు చేసినట్టు కనిపించటం లేదు. తెలంగాణలో కోదండరామ్ పార్టీ, గద్దర్ పార్టీ, టీ టీడీపీ పొత్తుకు అనుకూలమైన పార్టీల లిస్టులో వున్నాయి. పవన్ కళ్యాణ్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు, ఎంఐఎం ఎలాగూ కాంగ్రెస్ తో చేతులు కలిపే రాజకీయ వాతావరణం లేదు. బీజేపీ, టీఆర్ఎస్ లు బద్ధశత్రువులే! ఇలాంటి స్థితిలో తమతో కలసి నడవగలిగే కోదండరామ్, గద్దర్, టీ టీడీపీ శ్రేణుల్ని కూడా ఇంతవరకూ రాహుల్ పలకరించలేదు. ఉత్తమ్ కూడా వారి మీద దృష్టి పెట్టిన దాఖలాలు లేవు! మరి దీని ఎఫెక్ట్ ఏంటి? కాస్త రాజకీయం తెలిసిన వారెవరైనా చెప్పేస్తారు!

జాతీయ స్థాయిలో రాహుల్ మోదీకి వ్యతిరేకంగా వివిధ పార్టీల్ని జట్టుకట్టుటంలో విఫలం అవుతున్నారు. అదే సీన్ తెలంగాణలో రిపీట్ అవుతోంది. కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న వివిధ పార్టీల్ని తమతో కలిసేలా చేయలేకపోతున్నారు. కేసీఆర్ మాటల్లో ధ్వనించే భరోసాకు ఇదే కారణం! హైద్రాబాద్ లో హడావిడి పర్యటనలు, కుటుంబ పాలనపై సెల్ఫ్ గోల్స్ లాంటి కామెంట్లు చేయటం కంటే రాహుల్ ముందు పొత్తులపై ఆలోచిస్తే ఎంతో బావుంటుంది. ఎందుకంటే, మిగిలింది ఇంకాస్త సమయమే కాబట్టి!