కేసీఆర్ ఏ జిల్లాకు వెళ్లినా ఇదే పాట

 

కోదాడలో జరిగిన ప్రజా కూటమి బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌పై విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలు ఎన్నో కలలు కన్నారని, నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగిందని అన్నారు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని యువత ఆశించిందని, తెలంగాణ యువత తమ రక్తాన్ని ధారపోసి తెలంగాణ సాధించారని రాహుల్ కొనియాడారు. కానీ గత నాలుగేళ్లలో యువతకు, రైతులకు కేసీఆర్‌ చేసిందేమీలేదని విమర్శించారు. 3లక్షల మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారని.. కేసీఆర్‌ ప్రభుత్వంలో 4వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. బడా కాంట్రాక్టర్లకు మాత్రమే కేసీఆర్‌ అండగా ఉన్నారని ఆరో్పించారు. ఇటీవల నల్గొండ జిల్లాకు వచ్చిన కేసీఆర్ ఈ జిల్లాను దత్తత తీసుకుంటాననని ప్రకటించిన విషయాన్ని రాహుల్ గుర్తు చేశారు. కేసీఆర్ ఏ జిల్లాకు వెళ్లినా ఇదే పాట పాడతారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే రైతులను దత్తత తీసుకోవాలని, వాళ్ళు బలవన్మరణానికి పాలపడకుండా కాపాడాలని సూచించారు. ప్రాణహిత-చేవెళ్ల పేరు మార్చి రూ.50 వేల కోట్లు దోచుకున్నారని, కేసీఆర్‌ అంటే ఖావో కమీషన్‌ రావని రాహుల్‌ అభివర్ణించారు. ఈ నాలుగేళ్లలో కేటీఆర్‌ ఆదాయం 400 శాతం పెరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్‌తో ఏర్పడిందన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలపై తలా రూ. 2లక్షల అప్పుందని రాహుల్‌ గాంధీ అన్నారు.