ఏం చెయ్యకూడదో మోదీనే చెప్పారు

 

నిన్న వెలువడిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో ఘన విజయం సాధించడంపై ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కారణంగానే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పార్టీ నేతలు ఆయనను ప్రశంసిస్తున్నారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో స్పష్టమైన మెజార్టీ రాగా, మధ్యప్రదేశ్‌లోనూ అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్‌ అవతరించింది. దీంతో ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అధికారం చేపట్టబోతోంది. ఫలితాలు వెలువడిన అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తాను 2014 లోక్‌సభ ఎన్నికల ఓటమి నుంచి ఎంతో నేర్చుకున్నానని వెల్లడించారు. ప్రధాని మోదీకి అవినీతితో సంబంధం ఉందని ప్రజలు నమ్మారని అన్నారు. ఇక మోదీకి ఎన్నికలు చాలా కష్టంగా మారిపోయాయని స్పష్టమైందని తెలిపారు.

గత ఎన్నికల్లో ఉద్యోగకల్పన, అవినీతి నిర్మూలన తదితర హామీలతో మోదీ విజయం సాధించారని, ఇప్పుడు ఆ భ్రమలు తొలగిపోయాయని వెల్లడించారు. '2014 ఎన్నికలు నాకు చాలా మంచి చేశాయని అమ్మతో చెప్పాను. వాటి నుంచి చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా వినయం నేర్చుకున్నాను. నిజానికి నరేంద్ర మోదీనే నాకు పాఠం నేర్పించారు. ఏం చెయ్యకూడదో ఆయన చెప్పారు. మోదీకి ప్రజలు గొప్ప అవకాశం ఇచ్చారు. కానీ ప్రజల గుండెచప్పుడు ఆయన వినలేకపోవడం చాలా బాధాకరం' అని రాహుల్ తెలిపారు.