రాహుల్ ప్రధాన మంత్రి అభ్యర్థి కాదు

 

బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు సిద్దమయ్యి కూటమిని ఏర్పాటు చేయాలనుకున్నది విదితమే.అయితే కూటమిగా ఏర్పడితే ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఎవరిని ఎన్నుకోవాలి అనేది కత్తి మీద సాము లాంటిదే.అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం బీజేపీని అధికారానికి దూరం చేయటమే తమ లక్ష్యంగాని రాహుల్ ప్రధాని అవ్వటం కాదని తేల్చేసింది.ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగాలని కాంగ్రెస్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి. చిదంబరం ఈ విషయాన్ని ధృవీకరించారు.

‘రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావాలని అనుకుంటున్నట్లు మేం ఎప్పుడూ చెప్పలేదు. కొందరు కాంగ్రెస్‌ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఏఐసీసీ జోక్యం చేసుకుని వారిని అడ్డుకుంది. భాజపాను వెళ్లగొట్టడమే మా లక్ష్యం. వ్యక్తుల స్వేచ్ఛను గౌరవించే, అభివృద్ధి కోసం పాటుపడే, మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించే, రైతులను ఆదుకునే ప్రత్నామ్నాయ ప్రభుత్వం భాజపా స్థానంలో రావాలని మేం కోరుకుంటున్నాం. భాజపాపై పోరుకు కూటమిని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఎన్నికల అనంతరం భాగస్వామ్య పార్టీలతో కలిసి ప్రధానిని ఎంపిక చేయాలని యోచిస్తున్నాం’ అని చిదంబరం తెలిపారు.