కేంద్రానికి మా పూర్తి మద్దతు: రాహుల్ గాంధీ

 

పుల్వామాలో భద్రతాబలగాల మీద జరిగిన ఉగ్రదాడిని  కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖండించారు. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షాలు, దేశమంతా.. కేంద్రానికి, జవాన్లకు మద్దతుగా నిలుస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వానికి తమ పూర్తి స్థాయి మద్దతు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కఠిన పరిస్థితుల్లో ప్రభుత్వానికి, జవాన్లకు అండగా ఉంటామని పేర్కొన్నారు. అలాగే రాజకీయ వివాదాలకు సంబంధించిన ఏ ప్రశ్నకు సమాధానం ఇవ్వనని, దానికి ఇది సరైన సమయం కాదని వెల్లడించారు. ‘దేశాన్ని విభజించాలని టెర్రరిస్టులు భావిస్తున్నారు. అది ఎవరికీ సాధ్యం కాదు.. యావత్ దేశం, ప్రతిపక్షాలు కేంద్రానికి, భద్రతా దళాలకు మద్దతుగా ఉంటాయి. ఇది ఉద్విగ్నభరిత సమయం.. ప్రభుత్వానికి పూర్తి మద్దతు అందిస్తాం. ఈ రెండు మూడు రోజులు రాజకీయ చర్చలకు పార్టీ పరంగా దూరంగా ఉంటాం. ఏ ప్రేమతో ఈ దేశం నిర్మితమైందో... ఆ ప్రేమకు విద్వేషంతో హాని తలపెట్టలేరు’ అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన మీడియా కార్యక్రమంలో రాహుల్‌తోపాటు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ కూడా పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ.. ‘ఇది చాలా బాధాకరమైన రోజు. మన దేశం 40 మంది జవాన్లను కోల్పోయింది. జవాన్ల కుటుంబాలకు అండగా నిలవడమే మన మొదటి కర్తవ్యం. ఉగ్రవాదులను ఎదుర్కొనే విషయంలో ఏ మాత్రం రాజీపడే ప్రసక్తే లేదు’ అని ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.