ఎన్నికల నాటికి రాహుల్‌ పుంజుకుంటాడా!

ఒకప్పుడు రాహుల్ గాంధి ఓ అనామకుడు. ప్రజల దృష్టిలో తల్లి చాటు బిడ్డ, ప్రతిపక్షాల విమర్శలలో పప్పు. రాహుల్‌ గాంధి కామెడీ అని కొడితే యూట్యూబ్‌లో లెక్కలేనన్ని వీడియోలు కనిపించేవి. ఇక మోదీ అయితే చెప్పనే అక్కర్లేదు. ‘కొంతమందికి బాదం పప్పులు తిన్నా బుద్ధి పెరగదంటూ’ రాహుల్‌ని గడ్డిపోచలా తీసిపారేసేవారు. కానీ నిరంతరం శత్రువు మీదే ధ్యాస పెడితే, ఆ శత్రువుకి బలాన్ని అందిస్తూ మనం బలహీనులం అయిపోతామన్న ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోయారు మోదీ! పిల్లవాడిని రెచ్చగొట్టి పరిగెత్తించే తల్లిలాగా రాహుల్‌లో కసిని పెంచారు. ఫలితం ఇప్పుడు రాహుల్‌ పట్ల ప్రజాభిప్రాయంలో కాస్త మార్పు వస్తోంది. రాహుల్‌ ప్రసంగాలలో కాస్త పరిణతి, దూకుడు కనిపిస్తోంది. ఇక అతని ట్వీట్లు ఇప్పుడు టాక్ ఆఫ్‌ ద టౌన్‌గా మారుతున్నాయి.ఇంతకుముందు ప్రభావవంతమైన నేతల జాబితాలో ఎక్కడో కనిపించేవాడు కాస్తా ఇప్పుడు, మోదీ తర్వాతి స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు మోదీ స్థానం మాత్రం ఓ రెండడుగులు దిగజారినట్లు సర్వేలలో తెలుస్తోంది.

మైనారటీల మీద దాడులు, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, బ్యాంకు కుంభకోణాలు, నిరుద్యోగం... లాంటి సవాలక్ష సమస్యలు ఇప్పుడు మోదీ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. ఈ మంటల్ని మరింతగా రగులుస్తూ పెట్రోలు ధరలు ఎలాగూ పెరుగుతున్నాయి. బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఇవన్నీ ప్రతిబంధకాలే! డైనమిక్‌ నేతగా ప్రతి విషయం మీద కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే మోదీ సమస్యల మీద నోరెత్తకపోవడం కూడా ప్రజల్ని అసహనానికి గురిచేస్తోంది. ఒకవేళ ఏదన్నా సమస్య గురించి మాట్లాడినా, దానికి యాభై ఏళ్ల నాటి నెహ్రూ పాలనే కారణం అని చెప్పడం మరింత చిరాకు తెప్పిస్తోంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మరింత భిన్నంగా ఉంది. తెరాస పాలనలో లోటుపాట్లు ఉన్నా కేసీఆర్‌, కేటీఆర్‌లు ఎంతో కొంత అభివృద్ధి చేస్తున్నారనే నమ్మకంలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఆంధ్రలో పెద్దగా అభివృద్ధి జరగకపోయినా, దానికి కారణం బీజేపీ చేసిన ద్రోహమే అన్న కసితో అక్కడి ప్రజలు ఉన్నారు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో ఇలాంటి స్థానిక పరిస్థితులు బీజేపీకి ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి వచ్చే లోక్‌సభ్‌ ఎన్నికలలో బీజేపీ, కాంగ్రెస్‌లు పెద్దగా లాభపడకపోయినా... ప్రాంతీయ పార్టీలు మాత్రం బలం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కర్ణాటకలో కనిపించిన దృశ్యమే వచ్చే జాతీయ ఎన్నికలలో పార్లమెంటులోనూ కనిపించవచ్చు. అప్పుడు ఎవరు ఎలాంటి ఎత్తులు వేస్తారనేదాని మీదే భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఒకప్పుడైతే ఇలాంటి సందర్భాలలో మోదీ- షా ద్వయం వేసే ఎత్తులదే పైచేయిగా ఉండేది. కానీ కర్ణాటకలో రాహుల్ చూపిన సమయస్ఫూర్తితో, ఒకప్పటి పప్పుని అంత తేలికగా అంచనా వేయడానికి లేకుండా పోయింది. ఏకు మేకవడం అనే సామెత రాజకీయానికి అతికినట్లు సరిపోతుందేమో!