నేనే ప్రధాని.. ఇంత కాన్ఫిడెంట్ ఎక్కడినుండి వచ్చింది!

 

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి బాగానే ధైర్యం వచ్చినట్టుంది. ఒకప్పుడు అసలు మాట్లాడటమే సరిగ్గా రాని రాహుల్ గత కొద్ది కాలం నుండి తన పంథా మార్చి ప్రధాని మోడీ పై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. గుజరాత్ ఎన్నికల తరువాత అయితే రాహుల్ ను ఏకంగా హీరోనే చేసేశారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఇక ఆతరువాత పార్టీ బాధ్యతలు తీసుకున్న తరువాత తన దూకుడుని ఇంకాస్తా పెంచారు. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో అదే దూకుడిని చూపిస్తున్నారు రాహుల్. ఇంకో నాలుగు రోజుల్లో కర్ణాటక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు ముఖ్యంగా బీజేపీకి, కాంగ్రెస్ కు కీలకం కావడంతో ఎవరి వ్యూహాల్లో వారు ఉన్నారు. ప్రచార కార్యక్రమాల్లోనే కాదు.. ట్విట్టర్ వేదికగా కూడా బీజేపీ-కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ ఎన్నికల ద్వారానే ఇప్పుడు ప్రధానిగా ఉన్న మోడీ భవిత్యంపై కానీ... ప్రధాని అభ్యర్ధి రేసులో ఉన్న రాహుల్ భవితవ్యం కానీ ఆధారపడి ఉంది. ఇలాంటి నేపథ్యంలో రాహుల్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

కర్ణాటక ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన...2019లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవిస్తే తానే ప్రధాని అవుతానన్నారు. ‘‘2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవిస్తే నేనే ప్రధాని అవుతానేమో. అందులో తప్పేముంది’’ అని రాహుల్ గాంధీ అన్నారు.  అవినీతికి పాల్పడిన వ్యక్తిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎందుకు ప్రకటించారో ప్రధాని మోదీ ముందు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 5 వేల కోట్లు దోచుకున్న రెడ్డి సోదరులకు, రెడ్డి వర్గానికి ఆయన 8 సీట్లు ఎలా ఇచ్చారో వివరణ ఇవ్వాలని అన్నారు. అధికారంలోకి వచ్చి ఐదేళ్లు గడుస్తున్నా ఇంత వరకూ యువతకు ఉపాధి ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. ఇక రాహుల్ ఇంత ధైర్యంగా నేనే ప్రధాని అవుతా అని అనడంతో.. రాహుల్ కు ఇంత కాన్ఫిడెంట్ ఎక్కడినుండి వచ్చిందని పార్టీ నేతలే షాకవుతున్నారట. అంతేకాదు రాహుల్ కూడా కాంగ్రెస్ తరపున ప్రధాని నేనే అని ఇంకెవరికీ ఆ ఛాయిస్ లేదని చెప్పకనే చెప్పారు అని అనుకుంటున్నారు. మరి చూద్దాం.. రాహుల్ కల ఎప్పుడు నెరవేరుతుందో...