యువరాజవారి ప్రవచనాలు

 

యువరాజవారు “నాన్సెన్’ అని అన్నంత మాత్రానే ప్రభుత్వం ఆమోదించిన బిల్లులు సైతం చిరిగి చెత్త బుట్టలోకి తరలిపోతాయి. ఆయన కనుసైగ లోక్ పాల్ బిల్లు ఎగురుకొంటూ పార్లమెంటు ఆమోదం పొందేస్తుంది. ఆయన తీక్షణంగా చూస్తే చాలు...కొమ్ములు తిరిగిన కేంద్ర మంత్రులు కూడా తత్తరపడుతూ తమ పదవులకు రాజీనామాలు చేసేసి, పార్టీ సేవకి బిరబిరా పరుగులు తీస్తారు. మరి ఇంత పవర్ఫుల్ యువరాజవారు మనదేశంలో అనేక వ్యవస్థలు కొంత మంది వ్యక్తుల చెప్పుచేతలలో నడవడం చాలా అన్యాయమని వాపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

 

నిన్న న్యూఢిల్లీలో జరిగిన భారత పారిశ్రామిక, వాణిజ్య మండలుల సమాఖ్య (ఎఫ్‌ఐసిసిఐ -ఫిక్కీ) సమావేశంలో యువరాజవారు దేశంలో పేద, మధ్య తరగతి ప్రజలను పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్భణం, వ్యవస్థలో అవినీతి పీల్చిపిప్పి చేసేస్తున్నాయని పాపం! చాలా బాధపడిపోయారు.

 

ఇంత బాధపడుతున్నమన మోస్ట్ పవర్ఫుల్ యువరాజవారు ఉల్లిపాయలు మొదలు బియ్యం, పప్పులు, నూనెల వరకు ప్రతీ వస్తువుల ధరలు రెక్కలు కట్టుకొని ఆకాశానికి ఎగిరిపోతూ సామాన్యుడి బ్రతుకుభారం చేస్తుంటే మరి దానిని అరికట్టడానికి ఆయన ఏమి చేసారు? ఆయన ప్రభుత్వంలోని వ్యవసాయ శాఖ మంత్రిగా చేస్తున్నశరత్ పవార్ మహారాష్ట్రలో ఉల్లి, చెరుకు, పంచదార మార్కెట్లను తన గుప్పిట్లో పెట్టుకొని కృత్రిమ కొరత సృష్టిస్తుంటే యువరాజవారు ఎందుకు చూస్తూ ఊరుకోవలసి వచ్చింది?

 

కోట్లాది ప్రజలు, పసిపిల్లలు ఒకపూట అన్నానికి కూడా నోచుకొక ఆకలి చావులు చస్తుంటే, మరోవైపు గోదాములలో లక్షలాది టన్నుల బియ్యం, గోధుమలు ముక్కిపోతుంటే కేంద్రప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు అదిలించినా యువరాజవారు ఎందుకు మేల్కొనలేదు? సమస్యలను గుర్తించినప్పుడు వాటి పరిష్కారానికి ప్రయత్నించకుండా, పేదరికం గురించి, సామన్యుల సమస్యలు, కష్టాల గురించి ఎంతో బాధపడిపోతూ ఎన్నిఊకదంపుడు ఉపన్యాసాలు చేసినా వాటివలన ప్రజలకు ఒరిగేదేమీ లేదు.

 

అధికారం, ప్రభుత్వం అన్నీతన చేతిలో ఉంచుకొని, “సమస్యలు తీర్చవలసి ఉంది. అవినీతిని తొలగించవలసి ఉంది. అధిక ధరలు తగ్గించవలసి ఉంది. ప్రభుత్వం పనిచేయవలసి ఉంది” అంటూ ప్రజల వద్దకు వచ్చి చెప్పడం తమ చేతకాని తనాన్ని ప్రదర్శించుకోవడమే.

 

ఇస్రో శాస్త్రవేత్తలు ఒక ఉపగ్రహ ప్రయోగంలో విఫలమయితే, అది ఎందుకు విఫలమయిందో తెలుసుకొని ఆలోపాలను సవరించుకొంటూ ముందుకు సాగుతున్నందేనే నేడు వారు మనదేశానికి గర్వకారణమయిన ‘మంగళ యాన్’ న్ని దిగ్విజయంగా ప్రయోగించగలిగారు. మరి అదేవిధంగా దశాబ్దాలుగా దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేటికీ తమ ప్రభుత్వంలో, వ్యవస్థలలో లోపాలను సరిచేయడంలో ఎందుకు అశ్రద్ద వహిస్తోంది? అంటే దానికి చిత్తశుద్ది కొరవడటమే కారణమని చెప్పవచ్చును.

 

ప్రభుత్వాన్ని శాసించే స్థితిలో ఉన్నమన యువరాజవారు, తను గుర్తించిన ఈ సమస్యలను సవరించడానికి, సరిద్దదానికి ఎటువంటి ప్రయత్నం చేయకుండా ఇలా మైకు, ప్రేక్షకులు, అవకాశం దొరికినప్పుడల్లా ఇటువంటి ఊకదంపుడు ఉపన్యాసాలు చేయడం వలన ఏమి ప్రయోజనం? మాటలకు, చేతలకు పొంతన లేకపోతే ఆ మాటలకు కూడా ఎటువంటి విలువ ఉండదు. అదే పొంతన ఉంటే అది అమాద్మీలా తిరుగులేని ప్రజామోదం పొందుతుందని రుజువయింది కూడా. ప్రజలలో ఇంత రాజకీయ చైతన్యం చూసిన తరువాత కూడా వారిని ఇంకా ఇంకా ఇటువంటి ఊకదంపుడు ఉపన్యాసాలతో మెప్పించగలమని ఆయన భావిస్తే దానివల్ల కాంగ్రెస్ పార్టీయే నష్టపోవడం తధ్యం.