జనలోక్ పాల్ బిల్లు కోసం రాహుల్ వఖల్తా ఎందుకో

 

నాలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఓటమి, స్వంత యంపీలే యూపీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం, కనీసం తాము అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణా బిల్లుని ఆమోదింపజేసుకోలేని దుస్థితి. మిగిలిన మూడు రాష్ట్రాలలో పరాజయం కంటే గట్టిగా ఏడాది వయసు కూడా లేని ఆమాద్మీ పార్టీ చీపురు దెబ్బకి డిల్లీలో పరువుపోవడం కాంగ్రెస్ ను చాలా కలవరపరుస్తోంది. ఇది సరిపోనట్లు జనలోక్ పాల్ బిల్లుకోసం అన్నాహజారే నిరాహార దీక్ష మొదలుపెట్టడం మూలిగే ముసలి నక్క మీద తాటిపండు పడ్డట్లయింది కాంగ్రెస్ పార్టీకి. ఒకేసారి చుట్టుముట్టిన ఇన్నిసమస్యలతో కాంగ్రెస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నా, తన సహజసిద్దమయిన మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం మాత్రం మానుకోలేదు.

 

ఈరోజు యువరాజు రాహుల్ గాంధీ తన భజన బృందాన్ని వెంటేసుకొని డిల్లీలో మీడియా సమావేశం పెట్టి మరీ జనలోక్ పాల్ బిల్లు ఆవశ్యకత గురించి ప్రజలకు వివరించడం విశేషం. అవినీతికి వ్యతిరేఖంగా పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ జన లోక్ పాల్ బిల్లుపట్ల మొదటి నుండి చిత్తశుద్దితో వ్యవహరిస్తోందని, అందుకే ఈసారి పార్లమెంటులో ఈబిల్లును ఆమోదింపజేయాలని కాంగ్రెస్ కృతనిశ్చయంతో ఉందని అన్నారు.

 

ఆమాద్మీ చేతిలో తమ పార్టీ ఓడిపోయినందునో లేకపోతే అన్నాహజారే రాలెగావ్ లో నిరాహార దీక్ష చేస్తున్నారనో తామీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టలేదని, ఈ బిల్లు వల్ల దేశంలో అవినీతిని సమర్ధంగా నియత్రించవచ్చని భావించినందునే పార్లమెంటులో ప్రవేశపెట్టామని, ఈ బిల్లు ఆమోదానికి బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలకాలని ఆయన కోరారు. ఈ బిల్లుతో దేశంలో అన్ని సమస్యలను పరిష్కారమయిపోతాయని తాము భావించడం లేదని, కానీ ఆదిశలో ఇదొక మంచి ప్రయత్నంగా భావిస్తున్నామని అన్నారు.

 

అన్నాహజారే జనలోక్ పాల్ బిల్లు కోసం డిల్లీలో నిరాహార దీక్ష చేసినప్పుడు ఎన్నడూ ఒక్కసారి కూడా మాట్లాడని రాహుల్ గాంధీ ఇప్పుడు హటాత్తుగా జ్ఞానోదయం అయినట్లు జనలోక్ పాల్ బిల్లు గురించి వఖల్తా పుచ్చుకొని మాట్లాడటానికి కారణాలు ఆయనే స్వయంగా చెప్పకనే చెప్పుకొన్నారు. అయితే అవినీతిలో మునిగి తేలుతున్నతమ కాంగ్రెస్ పార్టీ అవినీతికి వ్యతిరేఖంగా పోరాటం చేస్తోందని చెప్పడం ఈ సం.లో అతిపెద్ద జోక్ అని అందరూ అంగీకరించక తప్పదు.