పెళ్ళీ వద్దు, ప్రధాని పదవీ వద్దు: రాహుల్ గాంధీ

 

అలనాడు సిద్దార్డుడు ప్రపంచాన్నే జయించే మహా చక్రవర్తో లేకపొతే ప్రపంచానికి శాంతి ప్రబోదించే గొప్ప సన్యాసో అవుతాడని జ్యోతిషులు చెప్పినపుడు, ఆయన తండ్రి తన కుమారుడు తప్పనిసరిగా చక్రవర్తి కావాలనే సంకల్పంతో, సిద్దార్డుడికి ప్రజల కష్టాలు, సమస్యల గురించి తెలియకుండా జాగ్రత్త పడుతూ, రాజమందిరంలోనే విద్యాబుద్దులు చెప్పించి పెళ్లి కూడా చేసాడు. అయితే, ఒకానొక రోజు ఆయన తన రాజమందిరంలోంచి బయటి ప్రపంచంలోకి వెళ్ళడం, అక్కడ తనకి తెలియని ప్రజల కష్టాలు, అశాస్వితమయిన జీవితం గురించి తెలుసుకోవడంతో, తన సంసారాన్ని, రాజ్యాన్నిత్యజించి సన్యాసిగా మారి భోదీ వృక్షం కింద తపసు చేసి బుద్ధుడుగామారి లోకానికి జ్ఞానం ప్రసాదించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.

 

‘కోరికలే దుఖమునకు మూల కారణం’ అని చెప్పిన బుద్దుడి ప్రవచనాల గురించి అందరికీ తెలిసి ఉన్నపటికీ, వాటిని సాధారణ మానవులెవరూ కూడా ఇంతవరకూ జయించలేకపోతున్నారు. ఈ ఉపోద్గాతం అంత ఇప్పుడు ఎందుకంటే, కాబోయే ప్రధానిగా అభివర్ణింపబడుతున్న రాహుల్ గాంధీ కూడా నిన్నఅదే వైరాగ్య భావనలతో మాట్లాడటమే.

 

గౌతమ బుద్ధుడు బయటి ప్రపంచాన్ని చూడటం వల్లనే సర్వసంఘ పరిత్యాగిగా మారితే, గత 9 సం.లుగా ప్రజలమద్య జీవితం గడుపుతూ, వారి కష్ట సుఖాలను దగ్గరనుండి గమనించి అర్ధం చేసుకొన్నరాహుల్ గాంధీ బహుశః వారి కష్టాలను చూసే వైరాగ్యం పెంచుకోన్నడో, లేక దశాబ్దాలుగా తన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలిస్తున్నా వారి జీవితాలలో మార్పు తేలేకపోయినందుకు చింతిస్తూ వైరాగ్యం పెంచుకోన్నాడో తెలియదు గానీ, మొత్తం మీద గౌతమ బుద్ధుడి ‘కోరికలే దుఖమునకు మూల కారణం’ అనే ఉపదేశ సారాంశాన్ని మాత్రం బాగా వంటబట్టించుకొన్నట్లు కనిపిస్తున్నారు.

 

నిన్న తన పార్టీకి చెందిన యువ యమ్పీలతో మాట్లాడుతూ తానూ ఇప్పుడపుడే పెళ్లి చేసుకోనని చెపుతూ అందుకు కారణాలు కూడా వివరించారు. “పెళ్లి చేసుకొంటే సంసారం ఏర్పడుతుంది. సంసారం నుండి పిల్లలు పుట్టుకు వస్తారు. దానితో కోరికలు, స్వార్ధం కూడా పుట్టుకు వస్తాయి. నా పిల్లలే దేశంలో అధికారం చేలాయించాలనే స్వార్ధం కూడా నాలో పుట్టుకు రావచ్చును. అందువల్ల ఇప్పుడపుడే పెళ్లి ప్రసక్తి లేదని” స్పష్టం చేసారు.

 

అంతటి ఆగితే, కాంగ్రెస్ పార్టీ పెద్దగా చింతించేది కాదు. కానీ, ఆయన తనకు ప్రధాని పదవి మీద కూడా ఏమాత్రం ఆసక్తి లేదని బాంబు పేల్చారు. తనకు ప్రధాని పదవి కంటే కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుండి బలపరచడమే ప్రధానం అని అన్నారు. తన నెహ్రు-గాంధీ కుటుంబ నేపద్యమే తనకు అందలం అందుబాటులోకి తెచ్చింది తప్ప మరో కారణం లేదని కుండ బద్దలు కొట్టారు.

 

తన నానమ్మ ఇందిరా గాందీ కొన్ని తప్పని పరిస్తితుల్లో పార్టీలో అధికార కేంద్రం సృష్టించారని, అయితే దేశంలో ప్రస్తుతం అటువంటి పరిస్థితులు లేవుగనుక, పార్టీలో, ప్రభుత్వంలో అధికార వికేంద్రీకరణ జరుగవలసిన సమయం ఆసన్నమయిందని, లక్షలాది సభ్యులుగల కాంగ్రెస్ పార్టీలో అర్హత గల ప్రతీ ఒక్కరూ కూడా అధికారంలో భాగస్వాములు కావాలని తానూ మనస్పూర్తిగా కోరుకొంటున్నానని ఆయన చెప్పారు. తద్వారా ఇక ఈ వంశపారంపర్య పాలనకు స్వస్తి చెప్పాలని అంటూ ఆయన కాంగ్రెస్ నేతల గుండెల్లో మరో బాంబు పేల్చారు.

 

ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకొన్న సోనియా గాంధీకి, కాంగ్రెస్ పార్టీ నేతలకీ ఆయన మాటలు సహజంగానే కలవరపరుస్తాయి. కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షుడిగా పట్టం కట్టించుకొన్న రాహుల్ గాంధీ అకస్మాత్తుగా ఇంత వైరాగ్యం ప్రదర్శించడం, అదికూడా ఎన్నికలను ఎదురుగా బెట్టుకొన్న ఈ సమయంలో పార్టీకి సారద్యం వహించి తరువాత ప్రధాని పదవిని అధిష్టించవలసిన వ్యక్తి, అలనాడు కురుక్షేత్ర మహాసంగ్రామంలో అస్త్ర సన్యాసం చేసిన అర్జునుడిలా మాట్లాడటంతో కాంగ్రెస్ పార్టీ చాలా అయోమయంలో పడింది.

 

కాంగ్రెస్ రాజకీయాలకు పూర్తీ విభిన్నమయిన పద్దతిలో మాట్లాడుతున్న ఆయన తీరును కాంగ్రెస్ ఖండించలేక, సమర్దించలేక సతమతమవుతోంది. బహుశః ఆయన నానాటికి దిగజారుతున్న తన పార్టీ పరిస్థితిని చూసి ఆవిధంగా అన్నారో లేక తానూ ఆయాచితంగా ప్రధాని పదవిని పొందడం నిజంగా ఇష్టంలేకనే ఆయన ఆవిధంగా అన్నారో తెలియదు కానీ, వర్తమాన రాజకీయాలలో ఈ విధంగా మనసులో మాటలు బయటపెట్టడం పార్టీకి ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది తప్ప పార్టీకి మేలుచేయదు.

 

తద్వారా ప్రధాని పదవి గురించి ఆయన వెల్లడించిన అభిప్రాయలు పార్టీ వ్యూహాలను బట్టబయలు చేసినట్లే అవుతుంది. ఇంతవరకు “మా ప్రధాని అభ్యర్ధి రాహుల్ గాంధీ విషయంలో మాపార్టీలో ఒక స్పష్టత ఉంది. మరి మీ ప్రధాని అభ్యర్ధి ఎవరు? మోడీనా, అద్వానీయా, సుష్మా స్వరాజా లేక మరేవరయినానా? అంటూ బీజేపీని ఆట పట్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలకి రాహుల్ గాంధీ తాజా ప్రకటనతో గొంతులో పచ్చి వెల్లక్కాయ పడినట్లయింది. రాహుల్ గాంధీ మాటలు ఇప్పుడు బీజేపీకి ఒక ఆయాచిత వరంగా లభ్యమవగా, కాంగ్రెస్ పార్టీని మనస్పూర్తిగా ద్వేషించే ప్రతిపక్షాలకు ఒక కొత్త ఆయుధంగా దొరికింది.

 

రాహుల్ గాంధీ వెల్లడించిన అభిప్రాయాలపై ఇప్పటికే దేశవ్యాప్తంగా మీడియాలో పెద్ద చర్చ మొదలయింది. ప్రతిపక్షనేతలు మొదలు మానసిక తత్వ శాస్త్ర నిపుణులు వరకు అందరూ ఈ చర్చలో పాల్గొంటూ ఆయన అభిప్రాయాలను రకరకాల కోణాలలో విశ్లేషణలు చేయడం మొదలుపెట్టారు.

 

ఇది, కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం మేలు చేయకపోగా పార్టీకి ఊహించని సమస్యలు తెచ్చిపెట్టింది. మరి అలనాడు అర్జునుడికి గీతోపదేశం చేసి కర్తవ్యం భోదించి యుద్ధానికి సన్నధం చేసినట్లు, రాహుల్ గాంధీకి కూడా సరయిన ఉపదేశం చేసి ఎన్నికల రణరంగంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు ఉరికించగల ‘శ్రీకృష్ణుడు’ ఎవరయినా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో లేదో చూడాలి.