కాంగ్రెస్ లోకి టీడీపీ సీఎం అభ్యర్థి

 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గా ఏర్పడిన తరువాత జరిగిన ఎన్నికల్లో తెరాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.దీంతో టీడీపీ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆర్‌.కృష్ణయ్య ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది.ఆ పార్టీ తరపున ఎల్‌బీ నగర్‌ స్థానం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.ఎన్నికల అనంతరం తెరాస గెలిచినప్పటికీ  కేసీఆర్ నే ముఖ్య మంత్రి పదవి చేపట్టినది విదితమే.

గత కొంత కాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్న కృష్ణయ్య బీసీ సంక్షేమ సంఘం కార్యక్రమాల్లోనే గడుపుతున్నారు.బీసీ పార్టీ పెట్టాలన్నచర్చా ఆ సంఘాల్లో జరుగుతోంది.50 రోజుల వ్యవధిలో బీసీ పార్టీని ప్రకటించి, రిజిస్ట్రేషన్‌, గుర్తు కేటాయింపు సాధించుకోవడం సాధ్యం కాకపోవటంతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తుంది.ఎన్నికల్లో సెటిలర్లతో పాటుగా బీసీ ఓటు బ్యాంకుపైనా దృష్టి పెట్టిన కాంగ్రెస్‌ పార్టీ టీడీపీకి దూరంగా ఉన్న కృష్ణయ్యను చేర్చుకోవాలన్న ఆలోచన చేసింది. అందులో భాగంగానే కృష్ణయ్యతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా ఒకటి, రెండు సార్లు చర్చలు జరిపినట్లు తెలుస్తుంది.తాజాగా కృష్ణయ్య మరోమారు జానారెడ్డితో సమావేశమయ్యారు.

 

 

సిట్టింగ్ సీటైన ఎల్‌బీ నగర్‌ నుంచి తాను పోటీ చేస్తానని, బీసీ సంఘాలతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాననీ జానారెడ్డికి చెప్పినట్టు తెలుస్తోంది.కానీ  ఎల్‌బీ నగర్లో కాంగ్రెస్‌ తరపున సుధీర్‌రెడ్డి ఇప్పటికే ప్రచారంలో పాల్గొంటున్నారు.దీంతో జానారెడ్డి ఎల్‌బీ నగర్‌ స్థానం కేటాయించే పరిస్థితి లేదని, ఇంకేదైనా నియోజకవర్గం కోరాలని కృష్ణయ్యకు సూచించినట్లు సమాచారం. లేని పక్షంలో ఎమ్మెల్సీ పదవి.. అధికారంలోకి వచ్చాక మంత్రి స్థాయి పదవినీ ఇస్తామనీ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. బీసీ సంఘాల్లో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు ఒకటి, రెండు రోజులు సమయం కృష్ణయ్య కోరినట్లు తెలిసింది. అంతా కుదిరితే కృష్ణయ్య త్వరలోనే కాంగ్రెస్‌ కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.