ప్రతిభను పెంచే - Pygmalion effect

ఓ పిల్లవాడు తరగతిలో అందరికంటే వెనకబడిపోయి ఉంటాడు. ఒకో తరగతీ దాటే కొద్దీ అతను మొద్దుగా పేరు తెచ్చేసుకుంటాడు. ఇక అతన్ని బాగు చేయడం ఎవరి తరమూ కాదని అంతా నిశ్చయించుకుంటారు. ఇంతలో ఒక ఉపాధ్యాయుడి దృష్టి ఆ పిల్లవాడి మీద పడుతుంది. కాస్త ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటే ఆ పిల్లవాడు ఓ ఆణిముత్యంగా మారతాడన్న ఆశ ఉపాధ్యాయుడికి ఏర్పడుతుంది. అంతే! అక్కడి నుంచి ఆ పిల్లవాడి జీవితమే మారిపోతుంది. ఎందుకూ పనికిరానివాడు కాస్తా... అద్భుతమైన ఫలితాలు సాధించడం మొదలుపెడతాడు.

 

వినడానికి ఇదంతా ఏదో సినిమాకథలాగా తోస్తోంది కదా! కానీ నిజజీవితంలో ఇది నూటికి నూరుపాళ్లూ సాధ్యమే అంటున్నారు. ఈ ప్రభావానికి ‘పిగ్మేలియన్ ఎఫెక్ట్‌’ అన్న పేరు కూడా పెట్టారు. పిగ్మేలియన్ ఒక గ్రీకు పురాణ పాత్ర పేరు. అతను ఓ గొప్ప శిల్పకారుడట. ఏ అమ్మాయి వంకా కన్నెత్తయినా చూడని, చూసినా ఆకర్షింపబడని ప్రవరాఖ్యుడట. అలాంటి పిగ్మేలియన్‌ ఓ అందమైన అమ్మాయి శిల్పాన్ని చెక్కుతాడు. తాను చెక్కిన శిల్పాన్ని చూసి తనే మనసు పారేసుకుంటాడు. చివరికి దేవుడి కరుణతో ఆ శిల్పానికి ప్రాణం వస్తుంది. అలా ప్రాణం వచ్చిన శిల్పాన్ని పిగ్మేలియన్ వివాహం చేసుకోవడంతో అతని కథ సుఖాంతం అవుతుంది. మన ఆశలకు అనుగుణంగా అనూహ్యమైన ఫలితాలను సాధించగలం అన్న ఆలోచనతో ‘పిగ్మేలియన్ ఎఫెక్ట్‌’ అన్న పేరు పెట్టారన్నమాట!

 

రోసెంతాల్‌, జాకబ్‌సన్‌ అనే ఇద్దరు పరిశోధకులు 1968లో ‘పిగ్మేలియన్ ఎఫెక్ట్‌’ ప్రతిపాదన చేశారు. తమ ప్రతిపాదనని నిరూపించడం కోసం వారు ఓ ప్రయోగాన్ని చేపట్టారు. ఇందుకోసం వారు కాలిఫోర్నియాలోని ఓ పాఠశాలని ఎంచుకొన్నారు. ఆ పాఠశాలలో పిల్లలందరి ఐక్యూలని నమోదు చేశారు. ఆ తర్వాత వారి ఉపాధ్యాయుల దగ్గరకు వెళ్లి వారిలో కొందరు పిల్లలు ఐక్యూ చాలా అద్భుతంగా ఉందనీ... ఆ పిల్లలు ఎప్పటికైనా మంచి ఫలితాలు సాధిస్తారనీ చెప్పారు. నిజానికి వాళ్లు సేకరించిన వివరాలు వేరు, ఉపాధ్యాయులకు చెప్పిన వివరాలు వేరు. కానీ పరిశోధకులు చెప్పిన వివరాలను నమ్మిన ఉపాధ్యాయులు, తమ నమ్మకానికి అనుగుణంగానే ప్రవర్తించడం మొదలుపెట్టారు. తెలిసో, తెలియకో అద్భుతాలు సాధించగలరు అనే పిల్లల మీద ఎక్కువ దృష్టి పెట్టారు. కొంతకాలం గడిచిన తర్వాత ఉపాధ్యాయులు దృష్టి పెట్టిన పిల్లలు నిజంగానే మంచి ప్రతిభను కనబరిచారు.

 

ఈ పిగ్మేలియన్‌ ఎఫెక్ట్‌ కేవలం బడిలోనే కాదు- ఆఫీసులో, ఇంట్లో, రాజకీయాల్లో... ఇలా మన జీవితంలోని ప్రతి సందర్భంలోనూ సత్ఫలితాలను సాధిస్తుందని చెబుతున్నారు. ఎదుటివ్యక్తి పనికిమాలినవాడు అన్న భావనతో ఉంటే, అతనితో మన ప్రవర్తన అలాగే ఉంటుంది. అలా కాకుండా అతనేదో సాధించగలడు అన్న నమ్మకంతో ఉంటే, అతని పట్ల మన ప్రవర్తించే తీరు మారిపోతుంది. మన ఆకాంక్షలు అతని మీద తప్పకుండా ప్రభావం చూపుతాయి. వాటిని అందిపుచ్చుకునేందుకు, అవతలివ్యక్తి కూడా ఓ నాలుగడుగులు ముందుకు వేసే ప్రయత్నం చేస్తాడు. పిగ్మేలియన్ ఎఫెక్ట్‌ ఇద్దరు వ్యక్తులకి మాత్రమే పరిమితం కాదు. ఒకోసారి మనమీద మనం నమ్మకాన్ని ఏర్పరుచుకున్నప్పుడు కూడా అనూహ్యమైన ఫలితాలను సాధించగలం. దీన్నే self-fulfilling prophecy అంటారు.

 

పిగ్మేలియన్‌ ఎఫెక్ట్‌ ఏ మేరకు పనిచేస్తుంది? అది అనవసరమైన ఆకాంక్షలకు కారణం అవుతుందా! ఎదుటివ్యక్తి మీద మరింత ఒత్తిడిని కలిగిస్తుందేమో! లాంటి సందేహాలు లేకపోలేదు. అయితే జీవితంలో ఏమీ సాధించలేము అని నిరాశ చెందే సందర్భాలలోనూ, అవతలి వ్యక్తి ఎందుకూ పనికిరాడన్న అభిప్రాయానికి వచ్చేసినప్పుడూ ఈ పిగ్మేలియన్ ఎఫెక్ట్‌ని కాస్త పరీక్షిస్తే తప్పకుండా భిన్నమైన ఫలితం వచ్చి తీరుతుందంటున్నారు.

 

- నిర్జర