సైకిల్... హస్తం... కమలం… ఇక ఫ్యాన్?

అన్న ఎన్టీఆర్ అంటే అందరికీ గుర్తుకు వచ్చే పార్టీ టీడీపీనే! ఆయన స్థాపించిన ఆ పార్టీ, దాని పచ్చ జెండా, సైకిల్ గుర్తు చరిత్ర సృష్టించాయి. అయితే, తరువాతి కాలంలో నందమూరి వారసులు కాకుండా నారా చంద్రబాబు నాయుడు టీడీపీకి పెద్ద దిక్కయ్యారు. ఇప్పుడు కూడా పార్టీని చంద్రబాబే ముందుండి నడుపుతున్నారు. బాలకృష్ణ ఎమ్మెల్యేగా సేవలందిస్తున్నా పెద్దగా పార్టీ వ్యవహారాల్లో కలుగజేసుకోరు. హరికృష్ణ, ఆయన తనయులు కూడా ఈ మధ్య టీడీపీకి దగ్గరగా ఏం మసులుకోవటం లేదు. మొత్తానికి ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు అందరూ రాజకీయంగా పెద్దగా యాక్టివ్ గా లేకుండా అయిపోయారు. కేవలం నందమూరి పురంధేశ్వరి మాత్రం ఇందుకు మినహాయింపు!

 

 

మొదట తండ్రి పెట్టిన టీడీపీలో ప్రస్థానం ప్రారంభించిన పురంధేశ్వరి క్రమంగా చంద్రబాబుతో రాజకీయ విభేదాల కారణంగా కాంగ్రెస్ దిశగా కదిలారు. అసలు ఎన్టీఆర్ మనసావాచాకర్మణా వ్యతిరేకించిన హస్తం పార్టీలో ఆమె చేరటమే పెద్ద సంచలనం! అయినా ఆమె సోనియా సైన్యంలో చేరిపోయారు. కేంద్ర మంత్రి పదవి కూడా అలంకరించారు. కానీ, రాష్ట్ర విభజన నేపథ్యంలో పురంధేశ్వరి పార్టీ ఫిరాయించారు. ఈసారి కాంగ్రెస్ కు బద్ధ వ్యతిరేకి అయిన బీజేపీ పార్టీలో చేరారు. టీడీపీ నుంచీ కాంగ్రెస్ లో చేరటం ఎంత విడ్డూరమో అంతే విచిత్రం కాంగ్రెస్ నుంచీ బీజేపీలోకి రావటం కూడా! కాకపోతే, కమలంలో చిన్నమ్మ ఆశించినంత వర్కవుట్ కాలేదు. బీజేపీ, టీడీపీ పొత్తు వున్నప్పుడు కూడా చంద్రబాబు సర్కార్ లో ఆమె భాగం కాలేకపోయారు. ఎంపీగానూ, ఎమ్మెల్యేగానూ గెలవని ఆమె ఏ  కేంద్ర, రాష్టర ప్రభుత్వ పదవి లేకుండానే కాలక్షేపం చేయల్సి  వచ్చింది. ఇప్పుడిక మరోసారి ఎన్నికల సీజన్ వస్తుండటంతో పురంధేశ్వరి కదలికలపై ప్రచారాలు మొదలయ్యాయి…

 

 

ఇప్పటికైతే బీజేపీలోనే వున్న పురంధశ్వరి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారని టాక్ వినిపిస్తోంది! అయితే, అది కమలం గుర్తుపై కాదట. ఫ్యాన్ గుర్తు మీదనట. వైసీపీలోకి జంప్ చేసి ఆమె విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారని అంటున్నారు. జగన్ కూడా ఓకే చేశారని చెబుతున్నారు. ఇది ఎంత వరకూ నిజమో ఇప్పుడే చెప్పలేం. కానీ, పురంధేశ్వరి ఇలాంటి నిర్ణయం తీసుకోటానికి బలమైన కారణమే వుంది. ఆమె తన  కొడుకు పొలిటికల్ ఎంట్రీకి ఈ పని చేయక తప్పటం లేదట.

 

 

పురంధేశ్వరి తనయుడు పరుచూరు నియోజకవర్గం నుంచీ పోటీ చేయాలని భావిస్తున్నాడట. గతంలో అక్కడ్నుంచీ దగ్గుబాటి వేంకటేశ్వరరావు పోటీ చేసి గెలిచారు. అయితే, ఇప్పుడు తమ అబ్బాయిని పరుచూరు నుంచి పోటికి దింపాలంటే బలమైన పార్టీ కావాలి. బీజేపీలో వున్న పురంధేశ్వరి అదే పార్టీ నుంచీ కొడుకు దించేంత రిస్క్ చేయలేరు. ప్రత్యేక హోదా విషయంలో పూర్తిగా విలనైన కాషాయ పార్టీ ఎంత మాత్రం సూటబుల్ కాదు. ఆ పార్టీ టికెట్ పై పురంధేశ్వరి రాజకీయ వారసుడు బరిలోకి దిగితే అసలుకే మోసం వస్తుంది. అలా కాదని టీడీపీ నుంచి పోటీ చేసే చాన్స్ కూడా లేదు. చంద్రబాబుతో పురంధేశ్వరి దంపతుల విభేదాలే కారణం. ఇక మిగిలింది జగన్ పార్టీనే! అందుకే, పురంధేశ్వరి తాను బీజేపీ వదిలి వైసీపీలోకి మారి, కొడుకుని కూడా ఫ్యాన్ గుర్తుపై పోటీ చేయించాలని భావిస్తున్నారట!

విజయవాడ ఎంపీగా పురంధేశ్వరి , పరచూరు ఎమ్మెల్యేగా ఆమె తనయుడు పోటీ చేసి గెలుస్తారో లేదో తరువాతి సంగతి… కానీ, ఏపీలోని ప్రధాన పార్టీలైన టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, వైసీపీలు అన్నిట్లో పని చేసిన ఘనత మాత్రం నందమూరి పురంధేశ్వరికే దక్కుతుంది. అలాగే, ఈ మద్య కన్నా లక్ష్మీనారాయణను చివరి నిమిషంలో వెనక్కి లాగేసిన బీజేపీ పెద్దలు చిన్నమ్మ పార్టీ మార్పుపై ఎలా స్పందిస్తారో కూడా చూడాలి!