పురందేశ్వరి కాంగ్రెస్ కి గుడ్ బై?

 

ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు తమ పార్టీ తరపున పోటీ చేసిన ముగ్గురు అభ్యర్ధులను ఓటేయకుండా తిరస్కరించారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేఖంగా తమ అధిష్టానం రాష్ట్ర విభజన చేస్తునందుకు నిరసనగా వారికి ఓటేయకుండా తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. కానీ, వైజాగ్ యంపీ మరియు కేంద్రమంత్రి అయిన ఆయన భార్య పురందేశ్వరి రాష్ట్ర విభజన అనివార్యమని, అందువలన సీమాంధ్ర ప్రాంతానికి న్యాయంగా రావలసిన ప్యాకేజీ కోసం పోరాడుతానని చెప్పడమే కాక, జీ.ఓ.యం.కు లేఖలు కూడా వ్రాసారు. కానీ, అదే సమయంలో తాను రాష్ట్ర విభజన వ్యతిరేఖిస్తున్నందున పార్లమెంటులో టీ-బిల్లుకి వ్యతిరేఖంగా ఓటు వేస్తానని కూడా విస్పష్టంగా ప్రకటించారు. ఆమె ఈరోజు మిగిలిన సీమాంధ్ర కేంద్రమంత్రులు, యంపీలతో కలిసి లోక్ సభ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఆందోళన చేయడంతో సోనియాగాంధీ కూడా కంగు తిన్నారు. రేపు తమ పార్టీ లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టినట్లయితే, తన మంత్రి పదవికి, పార్టీకి కూడా రాజినామా చేసేందుకు ఆమె సిద్దమవుతున్నట్లు సమాచారం.  ఒకవేళ ఆమె కాంగ్రెస్ పార్టీ వీడదలిస్తే, ఆమెను చేర్చుకోనేందుకు బీజేపీ, వైకాపాలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ రెండు పార్టీలలో చేరేందుకు ఆసక్తి లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి లేదా మరొకరు స్థాపించబోయే కొత్త పార్టీలో చేరినాచేరవచ్చును. ఆమె తన తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరితే బాగుంటుందని నందమూరి అభిమానులు కోరుకొంటున్నారు. కానీ ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు, చంద్రబాబుకి మధ్య గతంలో కొన్ని విభేదాలు ఏర్పడ్డాయి గనుక ఆమె తెదేపాలో చేరడం అనుమానమే. ఆమె పార్టీ వీడుతారా లేదా? వీడితే ఏ పార్టీలో చేరుతారు? అనే విషయాలు త్వరలోనే తేలిపోతాయి.