ప్రతీకారం తీర్చుకున్న సైన్యం.. పుల్వామా దాడి సూత్రధారి హతం

 

పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన దాడి ఘటనకి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పుల్వామా దాడి కీలక సూత్రధారి అయిన జైషే మహ్మద్ టాప్ కమాండర్ అబ్డుల్ రషీద్ ఘాజీని భారత సైన్యం మట్టుబెట్టింది. పుల్వామా దాడికి తెగబడిన ఉగ్రవాదుల కోసం సైన్యం విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ చేసింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి పుల్వామా జిల్లాలోని పింగ్లాన్ వద్ద భద్రతా దళాలకు ఉగ్రవాదులు తారసపడ్డారు.సైన్యంపై కాల్పులు జరుపుతూ భవనంలో దాక్కొన్న ముష్కరులను సైన్యం తీవ్రంగా శ్రమించి హతమార్చింది. అయితే ఉగ్రవాదులతో జరిగిన పోరులో ఆర్మీ మేజర్ సహా ముగ్గురు జవాన్లు, ఒక సాధారణ పౌరుడు మృతి చెందాడు.

32 ఏళ్ల అబ్ధుల్ రషీద్ ఘాజీ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ నాయకుడైన మసూద్ అజహర్‌కు అత్యంత నమ్మకస్తుడు. పుల్వామాలో దాడికి పాల్పడిన ఉగ్రవాది ఆదిల్‌ అహ్మద్‌ దార్‌కు గురువు. పుల్వామా ఉగ్రదాడి పాత్రధారి ఆదిల్‌ అయితే అతడి వెన్నంటి నడిపించిన సూత్రధారి అబ్దుల్‌ రషీద్‌ ఘాజీ. పుల్వామాలో ఉగ్రదాడి వెనుక ఐఈడీ నిపుణుడైన అతడి హస్తం ఉందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు భావిస్తున్నాయి. అతడే ఆదిల్‌కు ఆత్మాహుతి శిక్షణ ఇచ్చినట్లు అనుమానిస్తున్నాయి.

2017, 2018 సంవత్సరాల్లో దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఎన్‌కౌంటర్లలో జైషే చీఫ్‌ మసూద్‌ అజార్‌ మేనల్లుళ్లు తలాహ్‌ రహీద్‌, ఉస్మాన్‌ హతమయ్యారు. దీంతో భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని అజార్‌ రగిలిపోయాడు. ఈ బాధ్యతను రషీద్‌కు అప్పగించాడు. దీంతో రషీద్‌, మరో ఇద్దరు సహాయకులు గత ఏడాది డిసెంబరులో భారత్‌లోకి చొరబడినట్లు తెలుస్తోంది. గురువారం ఉగ్రదాడికి కొన్ని రోజుల ముందు రతిన్‌పొర గ్రామంలో మిలిటెంట్లు, భద్రతా దళాలకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇందులో రషీద్‌ త్రుటిలో తప్పించుకున్నాడు. కానీ.. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో సైన్యం చేతిలో హతమయ్యాడు.