గవర్నర్ ఇంటిముందు సీఎం నిద్ర.. ఇదో వెరైటీ!!

 

సీఎం గవర్నర్ ఇంటిముందు రోడ్డుపై నిద్రించారంటే నమ్ముతారా? నమ్మి తీరాలి. ఈ సంఘటన కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది. అక్కడి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ తీరును వ్యతిరేకిస్తూ సీఎం వి. నారాయణస్వామి బుధవారం నిరసన చేపట్టారు. నిన్న సాయంత్రం కిరణ్‌బేడీ ఇంటి ముందు బైఠాయించిన సీఎం రాత్రి కూడా అక్కడే నిద్రించారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా ఉన్నారు.

ఇటీవల లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వాహనదారులు హెల్మెట్లు పెట్టుకోవడం తప్పనిసరి చేశారు. అయితే దీన్ని సీఎం తప్పుబట్టారు. దశల వారీగా హెల్మెట్‌ నిబంధనను అమలు చేయాలని అన్నారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఇదే సమయంలో మంత్రిమండలి ప్రతిపాదనలను కిరణ్‌బేడీ వెనక్కిపంపారు. దీంతో ప్రజాప్రయోజనాలను కాంక్షిస్తూ వివిధ పథకాలకు సంబంధించి మంత్రిమండలి పంపిన ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నారంటూ సీఎం ఆందోళన చేపట్టారు. నల్లదుస్తులు ధరించి గవర్నర్‌ అధికారిక నివాసం ఎదుట బైఠాయించారు. రాత్రి రోడ్డుపైనే నిద్రపోయారు. గురువారం కూడా సీఎం నారాయణస్వామి దీక్ష కొనసాగుతోంది.

ఈ విషయంపై సీఎం మాట్లాడుతూ.. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకే ప్రధాని మోదీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ద్వారా ఇలా సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు సీఎం నిరసనపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ స్పందిస్తూ.. ‘సీఎం, ఆయన అనుచరులు రాజ్‌నివాస్‌ను చుట్టుముట్టారు. మమ్మల్ని బయటకు వెళ్లనివ్వట్లేదు. సిబ్బందిని లోనికి రానివ్వట్లేదు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. ప్రజాప్రతినిధులే చట్టాలను ఉల్లంఘిస్తున్నారు’ అని కిరణ్‌బేడీ ఆగ్రహం వ్యక్తం చేశారు.