56 శాతం మంది అమరావతికే ఓటేశారు

ఎన్నికలకు ముందు ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందని చెప్పిన వైసీపీ.. అధికారంలోకి వచ్చాక మాత్రం మూడు రాజధానులకు తెరదీసింది. అమరావతి రైతులు ఉద్యమించినా, విపక్షాలు వ్యతిరేకరించినా మూడు రాజధానుల విషయంలో జగన్ సర్కార్ వెనకడుగు వేయట్లేదు. తాజాగా మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో.. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు మూడు రాజధానుల చుట్టూనే తిరుగుతున్నాయి.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నామని, మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రజలు కూడా స్వాగతిస్తున్నారని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. అయితే విపక్షాలు మాత్రం.. అభివృద్ధి వికేంద్రీకరణ వేరు, రాజధాని వికేంద్రీకరణ వేరు.. ముందు రాష్ట్రానికి ఓ మంచి రాజధాని ఉంటేనే.. మిగతా ప్రాంతాలను అభివృద్ధి చేసుకోగలమని చెబుతున్నాయి. అంతేకాదు, వైసీపీ టీడీపీ పార్టీలు.. ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ప్రజాతీర్పుకి వెళ్లాలంటూ ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటున్నారు.

రాజధాని విషయంలో అధికార, విపక్షాల వాదనలు ఇలా ఉన్నాయి. మరి ప్రజల అభిప్రాయం ఎలా ఉంది?. అది తెలుసుకోవడం కోసమే తెలుగువన్ యూట్యూబ్ ఛానెల్ ఆన్ లైన్ పోల్ నిర్వహించింది. "ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల నిర్ణయం సరైనదని మీరు భావిస్తున్నారా?" అని అడగగా 96 వేల మందికి పైగా స్పందించారు. అందులో 56 శాతం మంది మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించగా.. 38 శాతం మంది మాత్రం మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్ధించారు. ఇక మిగిలిన ఆరు శాతం మంది చెప్పలేం అన్నారు. దాదాపు లక్ష మంది పాల్గొన్న ఈ పోల్ లో సగం మందికి పైగా అంటే 56 శాతం మంది మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అంటే ఎక్కువ శాతం మంది ప్రజలు అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారని అర్థమవుతోంది.