భారత్ లో కరోనాకు మరో కొత్త మందును ఓకే చేసిన డిసిజిఐ

భారత్ లో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ రావడానికి చాలా సమయం పడుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా కరోనా రోగులకు ఎమర్జెన్సీ సమయంలో వాడేందుకు ఇటోలిజుమాబ్ అనే ఇంజెక్షన్ కు అనుమతులు మంజూరు చేసింది. సొరియాసిస్ (psoriasis) అనే చర్మ వ్యాధిని తగ్గించేందుకు దీనిని ఇప్పటికే వాడుతున్నారు. ఐతే తాజాగా కరోనా పేషెంట్లపై ఈ మందును ప్రయోగించగా మంచి ఫలితాలు వచ్చాయని తెలుస్తోంది. బెంగళూరులోని బయోకాన్ ఇండియా లిమిటెడ్ ఈ మందును సొరియాసిస్ ట్రీట్ మెంట్ కోసం వాడేందుకు చాలా ఏళ్ల కిందట అనుమతి పొందింది.

ఈ ఇటోలిజుమాబ్ అనే మందు చాలా పవర్‌ఫుల్. దీంతో కరోనా చాలా తీవ్రంగా ఉండి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషంట్లకు మాత్రమే దీన్ని ఇస్తారు. కరోనా వైరస్ అంతు చూసే యాంటీబాడీల ఉత్పత్తికి ఉపయోగపడే సైటోకిన్ల ను ఉత్పత్తి చేయడంలో ఇది బాగా పనిచేస్తోంది. ఎయిమ్స్‌కు చెందిన కొందరు నిపుణులు ఈ మందుతో చేసిన ప్రయోగాలు సత్ఫలితాలు ఇచ్చాయి. ఐతే ఇది చాలా పవర్‌ఫుల్ కాబట్టి ఈ మందును తీసుకోవాలనుకునేవారు ముందుగా తమ అంగీకారం తెలుపుతూ పేపర్‌పై సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఈ ఇటోలిజుమాబ్‌ని మే నెలలో కరోనా ఉధృతంగా ఉన్న ముంబైలోని నాయిర్‌ హాస్పిటల్ వాడి చూసింది. వెంటిలేటర్‌తో ఉన్న ఇద్దరు రోగులకు ఇవ్వగా వాళ్లు కోలుకొన్నారు. ఈ మందు ఒక డోస్ ఇవ్వగానే రోగులు కోలుకుంటున్నారని ఐతే కొంత మందికి మాత్రం 3 డోసుల దాకా ఇవ్వాల్సి వస్తోందని సమాచారం.