దేవుడు ఉన్నాడు అనడానికి పృథ్వీరాజ్ ఎపిసోడ్ సాక్ష్యం!!

శ్రీవెంకటేశ్వర భక్తి చానల్‌(ఎస్వీబీసీ) చైర్మన్‌ పదవికి నటుడు పృథ్వీరాజ్‌ రాజీనామా చేశారు. గత కొద్దిరోజులుగా పృథ్వీరాజ్‌ ని వివాదాలు చుట్టుముడుతున్నాయి. రాజధాని అమరావతిలో ఆందోళన చేస్తున్న రైతులను పెయిడ్‌ ఆర్టిస్టులు అంటూ కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా.. రైతులు బురదలో ఉండాలి తప్ప.. ప్యాంట్లు, బంగారం వేసుకుంటారా? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో సొంత పార్టీ నేత నుండే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. వైసీపీ నేత పోసాని కృష్ణమురళి.. పృథ్వీరాజ్‌ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులకు, మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయినా పృథ్వీరాజ్‌ క్షమాపణలు చెప్పలేదు.. వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులేనంటూ..మళ్లీ వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉంటే.. పృథ్వీరాజ్‌ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్వీబీసీ చైర్మన్‌గా పృథ్వీరాజ్‌ను నియమించింది. అయితే ఎస్వీబీసీలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులను తొలగించి అక్రమ నియామకాలకు పాలపడినట్టు తెలుస్తోంది. ఆలా అక్రమంగా నియమించిన 36 మందిని తొలగించినట్లు టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి అంగీకరించారు. 

అంతేకాదు ఓ మహిళ ఉద్యోగినితో పృథ్వీ రాజ్ మాట్లాడినట్లు చెప్తున్న శృంగార సంభాషణల ఆడియో కూడా వెలుగులోకి వచ్చింది.  ‘‘పడుకునేటప్పుడు గుర్తొచ్చానా? మార్చి వరకు మందు తాగను. నేను తాగడం మొదలుపెడితే నీతోనే మొదలుపెడతా. వెనక నుంచి పట్టుకుందామనుకున్నా. కెవ్వు మని అరుస్తావని భయపడ్డా. నువ్వు నా గుండెల్లో ఉన్నావ్‌. ఐ లవ్‌ యూ’’ అని పృథ్వీరాజ్‌ మాట్లాడినట్టు ఆ ఆడియోలో ఉంది. ఆ ఆడియో వైరల్ కావడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పవిత్రమైన పదవిలో ఉంటూ ఇవేం పనులంటూ నెటిజనులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో ఎస్వీబీసీ చైర్మన్‌ పదవి నుంచి తప్పుకోవాలని.. సుబ్బారెడ్డి సూచించగా పృథ్వీరాజ్ హైదరాబాద్‌ లో ప్రెస్‌మీట్‌ పెట్టి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
 
అయితే పృథ్వీరాజ్‌ మాత్రం తనకి ఏ పాపం తెలియదు అంటున్నారు. "నా మీద లేనిపోనివి పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. అది నా గొంతుకాదు.. ఫేక్‌ ఆడియో. నేను పద్మావతి అతిథిగృహంలో మందు తాగానని, డబ్బులు తీసుకుని ఉద్యోగాలిచ్చానని వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్‌ విచారణకు సిద్ధం. రుజువైతే నన్ను చెప్పుతో కొట్టండి. అమరావతి రైతుల పట్ల నా మాటలను వక్రీకరించారు. అందరినీ క్షమాపణలు కోరుతున్నా." అని పృథ్వీ చెప్పుకొచ్చారు.
 
పృథ్వీ రాజ్ ఎపిసోడ్ ని చూసిన కొందరు... దేవుడు ఉన్నాడని అనడానికి ఇదే సాక్ష్యం అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. రైతుల గురించి తప్పుగా మాట్లాడిన పృథ్వీ అసలు బాగోతాన్ని.. ఆ శ్రీనివాసుడు రెండు రోజుల్లోనే బయటపెట్టాడంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు.