బూతు మాటల్లో నిజాయితీ ఉంటుందా!



నలుగురిలో ఉన్నప్పుడు ఎలాంటి పదాలు ఉపయోగించాలి? అని మనకి చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తుంటారు. అసభ్యంగా, అశ్లీలంగా తోచే పదాలని నలుగురిలోనూ వాడకపోవడం సంస్కారం అని చెబుతూ ఉంటారు. అందుకే మన పదాలన్నీ ఆచితూచి ఉంటాయి. ఏవన్నా తేడాపాడాగా పదం బయటకు రావాలని ప్రయత్నిస్తే... దానిని లోలోపలే కప్పెట్టేస్తాం. తరచూ బూతులు మాట్లాడేవారిని అనాగరికులుగా, మొరటు మనుషులుగా భావిస్తుంటాం. కానీ అలా ఏది పడితే అది మాట్లాడేవారిలో నిజాయితీ పాలు ఎక్కువ అని చెబుతోంది ఓ పరిశోధన!!!

 

ఇంగ్లండులోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు అసభ్యపదజాలానికీ, నిజాయితీకి మధ్య ఉండే పొంతనని గమనించాలని అనుకున్నారు. ఇందుకోసం వారు కొన్ని వందల మందిని ఎన్నుకొని వారి మాటతీరు మీద అనేక ప్రశ్నలు గుప్పించారు. ఆ తరువాత వారు చెబుతున్నదానిలో ఎంతవరకూ నిజం ఉందో తెలుసుకునేందుకు lie testను నిర్వహించారు. తమకి కోపం, కసి, చిరాకు, ఆశ్చర్యం వంటి అనుభూతులను వ్యక్తపరిచేటప్పుడు, వీరిలో కొందరు బూతుమాటలని గుప్పించడాన్ని గమనించారు. చిత్రం ఏమిటంటే వీరిలో నిజాయీతీపాళ్లు కాస్త ఎక్కువగా ధ్వనించాయట.

 

బూతుమాటలకీ నిజాయితీకీ మధ్య సంబంధం ఏమిటన్న ప్రశ్న రావచ్చు. దీనికి పరిశోధకులు స్పష్టమైన జవాబుని అందిస్తున్నారు. మనసులో ఏదీ దాచుకోనివారు, అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పాలని ప్రయత్నించేవారు... తమకి ఏది తోస్తే అది మాట్లాడేసే స్వభావాన్ని కలిగి ఉంటారట. సహజంగానే అందులో బూతులు కూడా చోటు చేసుకోవచ్చు.

 

పైన పేర్కొన్న ప్రయోగం ఎంతవరకు నిజమో తెలుసుకునేందుకు పరిశోధకులు మరో పరీక్షని కూడా నిర్వహించారు. ఇందుకోసం 75,000 మంది ఫేస్బుక్ యూజర్స్ని ఎన్నుకొన్నారు. వీరి ఆన్లైన్ సంభాషణల్లోని పదాలు ఎలా ఉన్నాయో గమనించారు. వీటిలో కూడా, మొరటు పదాలు వాడిన సంభాషణల్లో నిజాయితీ ఎక్కువగా కనిపించింది. ఇంతేకాదు! చీటికీ ఏదన్నా విషయం చెప్పేముందు ఒట్టుపెట్టుకునేవారిలో కూడా నిజాలను చెప్పే అలవాటు ఉందని తేలింది. ‘నా మాటలో నిజాయితీ ఉంది. నన్ను నమ్ము!’ అని ఒప్పించేందుకే వారు ఇలా ఒట్లు పెట్టుకుంటారట.

 

అదీ విషయం! అసభ్యంగా మాట్లాడటం, ఒట్టు పెట్టుకోవడం వెనుక ఇంత కథ ఉందన్నమాట. అలాగని ఇది అందరికీ వర్తిస్తుందనుకోవడానికి లేదు. పనిగట్టుకుని మరీ అసభ్యంగా మాట్లాడాల్సిన అగత్యమూ లేదు. మనుషుల వ్యక్తిత్వాలని పరిశీలించేందుకే కానీ, ఇలా ఉంటే మంచిది అని చెప్పడం ఈ పరిశోధన ఉద్దేశం కాదు. మనిషిలో సంస్కారం ఉంటే ఒట్టు పెట్టుకోకుండానే నిజాన్ని చెప్పగలడు. గుండెల్లో ధైర్యం ఉంటే అసభ్యతకు తావులేకుండానే, నిజాన్ని కుండబద్దలు కొట్టేయగలడు.

- నిర్జర.