ఒకవైపు బీజేపీ... మరోవైపు ఆత్మహత్యలు... తీవ్ర ఒత్తిడిలో కేసీఆర్...

 

ఒకవైపు ఆర్టీసీ సమ్మె రోజురోజుకీ ఉధృతమవుతుండటం... మరోవైపు కార్మికుల ఆత్మహత్యలతో రాష్ట్రంలో అలజడి రేగడం... ఇంకోవైపు విపక్షాల విమర్శలతో కేసీఆర్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇక, తెలంగాణలో పాగా వేసేందుకు సరైన అవకాశం కోసం ఎదురుచూస్తోన్న బీజేపీ... ఆర్టీసీ సమ్మెను ఆయుధంగా మలుచుకోవాలని చూస్తుండటంతో... టీఆర్‌ఎస్‌ సర్కారు అప్రమత్తమైంది. బీజేపీకి, కేంద్రానికి ఏ చిన్న అవకాశం ‎ఇవ్వకూడదని భావిస్తోన్న కేసీఆర్‌... ఆర్టీసీ సమ్మెను విరమింపజేసేందుకు చర్యలు చేపట్టారు. ఆర్టీసీ సమ్మె ఇలాగే కొనసాగితే... ఆత్మహత్యలు, ఆందోళనలతో పరిస్థితి మరింత అదుపుతప్పే ప్రమాదం తప్పదని గుర్తించిన సీఎం కేసీఆర్... ఎట్టకేలకు ఒక మెట్టుదిగి... మరో అడుగు ముందుకేశారు. ఆర్టీసీ కార్మికులతో అసలు చర్చలే లేవని, వాళ్లసలు ఉద్యోగులే కాదంటూ ప్రకటించిన కేసీఆరే... చివరికి పరిస్థితి చేయి దాటుతుండటంతో రాజ్యసభ ఎంపీ కేకేను రంగంలోకి దింపారు. ఆర్టీసీ కార్మికులతో చర్చల కోసం కేకేను హుటాహుటిన ఢిల్లీ నుంచి హైదరాబాద్ రప్పించారు. ఇక, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన కేకే.... చర్చలకు సిద్ధంకావాలని ఆర్టీసీ కార్మిక సంఘాలకు పిలుపునిచ్చారు.

అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ఫైరైన ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి... ఎవరు పిలిచినా చర్చలు వస్తామని తెలిపారు. కానీ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటేనే చర్చలు వస్తామని తేల్చిచెప్పారు. కేసీఆర్ బెదిరింపులు, మంత్రుల రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే... ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులపై పోలీసుల దమనకాండపై గవర్నర్‌కు చేశామని తెలిపారు. అయితే, ఒకవైపు హుజూర్ నగర్ ఉపఎన్నిక... మరోవైపు ఛాన్స్ కోసం కాచుకుని కూర్చున్న బీజేపీ... ఇంకోవైపు కార్మికుల ఆత్మహత్యలతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న కేసీఆర్... ఏదిఏమైనాసరే రెండు రోజుల్లో సమ్మెను విరమింపజేయాలన్న లక్ష్యంతో సానుకూల ధోరణితో అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. మరి కేకే మధ్యవర్తిత్వం విజయవంతమవుతుందో లేదో చూడాలి.