అయోధ్య రామమందిర నిర్మాణానికి రాష్ట్రపతి విరాళం

అయోధ్య రామ మందిర నిర్మాణానికి భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విరాళమిచ్చారు. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులకు తన వంతుగా రూ.5,00,100 విరాళాన్ని అందించారు. 

 

రామ మందిర నిర్మాణం కోసం విరాళాల సేకరణ కార్యక్రమాన్ని రామ జన్మభూమి ట్రస్ట్, విశ్వ హిందూ పరిషత్ లు నేడు ప్రారంభించాయి. విరాళాల సేకరణలో భాగంగా దేశ ప్రథమ పౌరుడు రామ్ నాథ్ కోవింద్ ను రామ జన్మభూమి ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్, వీహెచ్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ తదితరులు కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి చెక్కును అందించారు.

 

స్వచ్ఛంద విరాళాల సేకరణ ద్వారా రామ మందిరం నిర్మాణం జరుగుతుందని, జనవరి 15 నుంచి విరాళాలను సేకరిస్తామని ట్రస్ట్ గతంలోనే ప్రకటించింది. ఫిబ్రవరి 27 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. దేశ వ్యాప్తంగా కోటి ఇళ్ల నుంచి విరాళాలను సేకరించనున్నట్టు ట్రస్ట్ తెలిపింది. అంతేకాదు, పారదర్శకత ఉండేందుకు రూ. 20 వేలు అంతకంటే ఎక్కువ మొత్తం విరాళాలను చెక్ రూపంలో సేకరించనున్నారు. రూ. 2 వేల కంటే ఎక్కువ ఇచ్చిన వారికి రశీదు ఇవ్వాలని ట్రస్ట్ నిర్ణయించింది.