గుంటూరు ప్రేమికులను భయపెడుతున్న మారుతీరావు

 

ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకు రీల్ విలన్ అంటే రావుగోపాలరావు ఎలా గుర్తొచ్చాడో.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలోని యువతకు రియల్ విలన్ అంటే మారుతీరావు పేరు అలా గుర్తుకొస్తుంది.. తన కూతురు అమృత, ప్రణయ్ అనే యువకుడిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకుందనే కోపంతో.. సొంత అల్లుడిని అత్యంత కిరాతకంగా చంపించిన వ్యక్తి మారుతీరావు.. ప్రణయ్ హత్య ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే దేశవ్యాప్తంగా సంచలమైంది.. ప్రజలు, ప్రజా సంఘాలు ఈ ఘటనను తీవ్రంగా వ్యతిరేకించారు.. అయితే ఈ ఘటన మరువకముందే హైదరాబాద్ నడిబొడ్డున మరో ఘటన చోటుచేసుకుంది.. కూతురు ఇష్టంలేని పెళ్లి చేసుకుందనే కోపంతో కూతురు మాధవి, అల్లుడు సందీప్ పై  మనోహరాచారి కత్తితో దాడి చేసాడు.. ప్రస్తుతం మాధవి పరిస్థితి విషమంగా ఉంది.. ఈ వరుస సంఘటనలతో ప్రేమికుల్లో భయం మొదలైంది.. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. 

ప్రేమ పెళ్లిళ్లు అంగీకరించని తండ్రులు, కన్న బిడ్డలను సైతం చంపేందుకు వెనకాడటం లేదు.. దీంతో ఇలాంటి మరెన్నో ప్రేమ జంటలు ఇప్పుడు పోలీసు స్టేషన్ బాటపట్టాయి.. మాకు రక్షణ కల్పించడండి అని పోలీసులను కోరుతున్నారు.. ప్రేమ వివాహాలు చేసుకున్న జంటలు రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించడం సహజంగా జరుగుతూనే ఉంటుంది.. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న వారిలో కొంత భయం ఉండడం సహజమే.. అయితే మిర్యాలగూడ, హైదరాబాద్ ఘటనలతో గుంటూరు జిల్లాలోని ప్రేమికుల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుని ఇరు కుటుంబ సభ్యులు హెచ్చరికలతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న జంటల్లో ఈ ఘటనలు మరింత ఆందోళన రేకెత్తిస్తున్నాయి.. వీరితో పాటు రోజుల వ్యవదిలో వివాహాలు చేసుకున్న వారు, వివాహాలకు సిద్ధమైన వారు భయంతో పోలీసులను ఆశ్రయిస్తున్నారు.. దీంతో పోలీసులు వారికీ ధైర్యం చెప్పే పనిలో పడిపోయారు.