ప్రణబ్‌ వ్యూహం అదిరిపోయిందిగా!

 

ఎప్పుడెప్పుడా అని దేశం అంతా ఎదురుచూస్తున్న ప్రణబ్‌ ముఖర్జీ నాగ్‌పూర్‌ యాత్ర ముగిసింది. అనుకున్నట్లుగానే ప్రణబ్ ముఖర్జీ నొప్పించక తానొవ్వక అన్న రీతిలో ప్రసంగాన్ని లాక్కువచ్చారు. అరెస్సెస్‌ను పొగిడితే కాంగ్రెస్‌కు ఎక్కడ కాలుతుందో అనీ, తిడితే ఎక్కడ బీజేపీ భగ్గుమంటుందో అనీ గాల్లో తాడు మీద నడిచినంత సుతారంగా ప్రసంగాన్ని సాగించారు. అదే సమయంలో పటేల్‌ను పొగిడి ఆరెస్సెస్‌, పరమత సహనం గురించి మాట్లాడి కాంగ్రెస్‌ చంకలు గుద్దుకునేలా చేశారు.

ప్రణబ్‌ ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా... ఆయన సమావేశానికి హాజరు కావడం వల్ల ఆరెస్సెస్‌ వైపే లాభం మొగ్గు చూపుతోంది. నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్‌వాదులు వెలివేసీ, వెక్కిరించిన ఆరెస్సెస్‌ ప్రాంగణంలో అడుగుపెట్టడం అంటేనే ఆ సంస్థ ప్రాముఖ్యతని ఆయన గుర్తించినట్లు. పైగా హెగ్డేవార్‌ని భారతదేశపు ముద్దుబిడ్డగా అభివర్ణించడంతో, ఆరెస్సెస్‌ సంబరానికి అవధులు లేకుండా పోయింది. ఇప్పటివరకూ కాంగ్రెస్, గాంధీని చంపిన సంస్థగా ఆరెస్సెస్‌ను దుమనమాడేది. అలాంటి సంస్థనీ, దాని వ్యవస్థాపకుడినీ పొగిడిన ప్రణబ్‌ చర్య మింగుడుపడటం కష్టమే!

ప్రణబ్‌ ఎంత జాగ్రత్తగా మాట్లాడినా, ఆయన మాటల్ని అంతా మర్చిపోతారనీ... ఆయన ప్రసగించిన దృశ్యాలని మాత్రం ఆరెస్సెస్, బీజేపీ అవాస్తవాలని జోడించి తమకు అనుకూలంగా మార్చేసుకుంటాయని సాక్షాత్తు ఆయన కూతురు శర్మిష్ఠ హెచ్చరించారు. నిజంగానే సమావేశం ముగిసిన తర్వాత హిందుత్వవాదులు, తమకు అనుకూలమైన వార్తల్ని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ప్రణబ్‌ తల మీద ఆరెస్సెస్‌ టోపీ పెట్టుకొని, వారి తరహాలోనే అభివాదం చేస్తున్నట్లు మార్ఫ్ చేసిన ఫొటోలను వదిలారు.

ఇదంతా పక్కన పెడితే... అసలింతకీ ప్రణబ్‌ దా తగుదునమ్మా అంటూ ఆరెస్సెస్ సమావేశానికి ఎందుకు వెళ్లినట్లు. పెద్ద మనిషిగా నాలుగు మంచి మాటలు చెప్పడానికా అంటే కాదు, పాత వైరాలన్నీ మర్చిపోయి కలిసిపోవడానికా అంటే అదీ కాదు... మరెందుకు! ప్రణబ్ పైకి కాంగ్రెస్‌కు వీరవిధేయుడిలాగానే కనిపిస్తారు. ఆయనను రాష్ట్రపతిని చేయడం ద్వారా కాంగ్రెస్ అందుకు తగిన గుర్తింపుని కూడా అందించింది. కానీ ప్రణబ్‌ మనసులో ఇంకా ఏదో లోటు ఉన్నట్లు కనిపిస్తుంది.

పైకి చెప్పుకోకపోయినా మొదటి నుంచీ ప్రణబ్‌కు ప్రధాని పీఠం మీద ఆసక్తి ఉంది. ఇందిరాగాంధీ మరణం తర్వాత తనకు తప్పకుండా ఆ పీఠం దక్కుతుందని ఆశించారు ప్రణబ్‌. కానీ రాజీవ్‌ రంగప్రవేశంతో హతాశుడయ్యాడు. అందుకే కొన్నాళ్లపాటు కాంగ్రెస్‌ నుంచి దూరమై సొంత కుంపటి పెట్టుకున్నారు. రాజీవ్ మరణం తర్వాత పీ.వీ నరసింహరావు, ఆ తర్వాత మన్మోహన్‌ సింగ్‌లు ప్రధాని పదవిని సాధించారు కానీ ప్రణబ్‌కు మాత్రం మొండిచెయ్యే మిగిలింది. తనకి హిందీ రాకపోవడం వల్లే ప్రధానిని కాలేకపోయానని సరదాగా అన్నా, తనతటి మేధావికి ప్రధాని పదవి దక్కకపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారని అంటారు.

ఇంతకీ అసలు విషయానికి వస్తే... ఈమధ్యకాలంలో మోదీ-షాల ప్రభ కొడిగడుతున్నట్లు కనిపిస్తోంది. అటు కాంగ్రెస్‌ను చూస్తేనేమో పూర్తిస్థాయి మెజారటీ దక్కించుకునేట్లు లేదు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా... రాహుల్‌గాంధీనే వారి ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలుస్తాడు. అదే ప్రతిపక్షాలన్నింటికీ దగ్గరగా ఉండి మూడోకూటమిని గెలిపించుకుంటే! కాంగ్రెస్ లేదా బీజేపీల మద్దతుతో అధికారంలోకి వస్తే! ఇదంతా జరగాలంటే మూడో కూటమికి ఓ పెద్దమనిషి ప్రధాని అభ్యర్థిగా ఉండాలి. అతను అటు కాంగ్రెస్‌కు, ఇటు బీజేపీకి కూడా ఆమోదయోగ్యం అయి ఉండాలి. ప్రస్తుత వాతావరణంలో అలాంటి వ్యక్తి ఎవరా అని పరిశీలిస్తే... బహుశా ప్రణబ్‌ పేరే ముందు వినిపిస్తుందేమో! ప్రణబ్‌ ఆలోచన కూడా ఇదే అయితే... ఆయన వ్యూహం అదిరిపోయిందిగా!!!