మమ్మల్ని గుర్తించండి అంటున్న కూటమి నేతలు

 

రేపు తెలంగాణలో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అటు టీఆర్ఎస్ ఇటు ప్రజకూటమి నేతలు గెలుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజకూటమి నేతలు మరో అడుగు ముందుకేసి గవర్నర్ నరసింహన్‌ తో భేటీకి సిద్ధమయ్యారు. ప్రజాకూటమిని ఒక జట్టుగా గుర్తించాలంటూ గవర్నర్‌ను కోరాలని ప్రజాకూటమి భాగస్వామ్య పక్షాలు నిర్ణయించాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, తెలుగుదేశం, తెలంగాణ జనసమితి, సీపీఐలు కలసి పోటీ చేసినందున ఈ కూటమిని అంతా ఒకటిగానే గుర్తించాలని విన్నవించనున్నాయి. ఫలితాల అనంతరం రాజ్యాంగబద్ధంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజాకూటమి ముఖ్యనేతలు గవర్నర్‌ ను కలసి వినతిపత్రం అందచేయనున్నారు. ఈమేరకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆర్‌.సి.కుంతియా, దామోదర రాజనర్సింహ, ఎల్‌.రమణ, కోదండరాం, పల్లా వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, అజాహరుద్దీన్‌, కుసుమ్‌కుమార్‌తో పాటు వీహెచ్‌, పొన్నాల లక్ష్మయ్య, మధుయాస్కీ, సంపత్‌కుమార్‌, వంశీచంద్‌రెడ్డి తదితరులు సమావేశమై చర్చించారు.

గవర్నర్‌కు వివరించాల్సిన అంశాలతో పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఫలితాలు వచ్చాక వ్యవహరించాల్సిన వ్యూహంపైనా ప్రణాళిక రూపొందించారు. ఫలితాల తరవాత ప్రత్యర్థులు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించే అవకాశాలపై ఆయన దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ నేతలపై జరిగిన భౌతికదాడులు, ఓట్ల గల్లంతుపై కూడా గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. మూడు నెలలుగా తెరాస ఆపద్ధర్మ ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అరాచకాలను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్తామని ఎల్‌.రమణ విలేకరులకు వివరించారు. ఇలాంటివి జరిగే అవకాశాలున్నాయని గతంలోనే తాము ఈసీకి, గవర్నర్‌కు ఫిర్యాదులు చేశామని, చివరకు అదే జరిగిందని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ఇంటి తలుపులు పగలగొట్టి అర్ధరాత్రి అరెస్టు చేయడం, పోలింగ్‌ రోజున వంశీచంద్‌రెడ్డిపై భౌతిక దాడి చేయడం, వేలాదిమంది ఓటర్ల పేర్లను ఉద్దేశపూర్వకంగా జాబితాల నుంచి తొలగించడం వంటి అంశాలన్నింటిపైనా గవర్నర్‌కు వివరిస్తామన్నారు.