నన్ను ఇంతవాడిని చేసింది ఆయనే: ప్రభాస్

 

తెలుగు సినిమా హీరోలలో ప్రభాస్ వంటి మంచి ఒడ్డుపొడుగు, వర్చసు ఉన్న అందగాళ్ళు చాలా కొద్ది మందే ఉన్నారు. రాష్ట్రంలో ఎందరో కన్నె పిల్లల కలల యువరాజు అతను. అటువంటి వ్యక్తి నిజంగానే బాహుబలి కోసం కత్తి పట్టుకొని, కిరీటం పెట్టుకొని యువరాజుగా మారిపోతే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది..కదా కానీ సుమారు రెండున్నరేళ్ళకు పైగా మరే సినిమా చేయకుండా బాహుబలికే అంకితమయిపోయిన ఆయన కనబడకపోవడంతో ఆయన అభిమానులు చాలా బాధపడ్డారు. కానీ వారి బాధను దూరం చేస్తూ మళ్ళీ ఈరోజు బాహుబలి ఆడియో రిలీజ్ కార్యక్రమంలో ప్రభాస్ ప్రజల ముందుకు వచ్చేరు. ఇంతవరకు పెద్ద గడ్డం, మీసాలతో చాలా కరుకుగా కనిపించిన ప్రభాస్ ఈరోజు మళ్ళీ అందాల రాకుమారుడిలా తెల్ల చొక్కా వేసుకొని చాలా నీట్ గా ప్రత్యక్షం అయ్యేసరికి అభిమానులు ఆనందం పట్టలేకపోయారు.

 

ఈ సినిమాకి అపూర్వమయిన సంగీతం అందించిన కీరవాణిని ఆయన తెగ మెచ్చుకొన్నారు. రాజమౌళి దగ్గర సుమారు మూడేళ్ళపాటు శిష్యరికం చేసి చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకొన్నానని అన్నారు. సినీ పరిశ్రమలో తనకు ఈ పునాది వేసిన తన పెదనాన్నగారు అలనాటి మేటి నటుడు కృష్ణంరాజు గారికి కృతజ్ఞతలు తెలిపారు.

 

"నా సినీ కెరీర్ లో వరుసగా నాలుగు ఫ్లాప్ సినిమాలు పడిన సమయంలో రాజమౌళి నాతో ఈసినిమా తీయాలనుకోవడం నా అదృష్టమే. పెద్ద సినిమా తీస్తున్నామని చెప్పారే గానీ మరీ ఇంత భారీ సినిమా అని నేను మొదట ఊహించలేకపోయాను. ఛత్రపతి సినిమాతోనే మా ఇద్దరి మధ్య ఒక అనుబందం ఏర్పడింది. అది ఈ బాహుబలితో మరింత బలపడింది. మేమంతా ఒకే కుటుంబానికి చెందిన అనుభూతి నాకు కలుగుతోంది.అంతగా కలిపోయాము. రాజమౌళి నాగురించి చాలా గొప్పగా చెప్పారు. కానీ ఎన్ని సినిమాలు చేసినా ఆయనంతగోప్పవాడిని కాలేను. నేనే ఆయనకి పెద్ద అభిమానిని. ఎటువంటి సమస్యలున్నా నిర్భయంగా నిసంకోచంగా ఆయనకు చెప్పుకోగలను అంత దగ్గరయ్యారు ఆయన."

 

"బాహుబలి సినిమా భారతదేశ సినీ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందని అన్నారు. అదేవిధంగా యావత్ ప్రపంచం కూడా భారతీయ సినీ పరిశ్రమ శక్తి సామర్ధ్యాలు ఈ సినిమాతో గుర్తించబోతున్నాయని చాలా గట్టి నమ్మకంతో చెప్పారు. తనకు ఛత్రపతితో మంచి ఫౌండేషన్ వేసిన రాజమౌళి వలననే అంతర్జాతీయ స్థాయిలో ఒక గుర్తింపునిచ్చే సినిమాను చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అందుకు రాజమౌళికి సర్వదా రుణపడి ఉంటానని అన్నారు.